సునామీ బీభత్సం(2011నాటి ఫొటో)
టోక్యో: తూర్పుఆసియాలోని ద్వీపదేశం జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపానికి కొనసాగింపుగా సునామీ చెలరేగడంతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6:38కి జపాన్ ఈశాన్య తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున్న రాకాసి అలలు ఎగిసి ప్రఖ్యాత పుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి.
పుకుషిమా నగరానికి 37 కిలోమీటర్ల దూరంలో 11.4 కిలోమీటర్ల లోతులో(ఫసిపిక్ సముద్రంలో) భూకంపకేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలు వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలను జారీచేసిన ప్రభుత్వం.. అణుశక్తి కేంద్రంతోపాటు ఈశాన్య తీరంలోని గ్రామాలను త్వరితగతిన ఖాళీచేయించ ప్రయత్నం చేసింది. దేశ రాజధాని టోక్యోలో సైతం భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
నేటి సునామీతో నీటమునిగిన పుకుషిమా అణుశక్తి కేంద్రం.. 2011లోనూ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నాటి భూకంప విలయంలో 20 వేలమందికిపైగా మరణించారు. అణుకేంద్రాన్ని పునరుద్ధరించడానికి ఏళ్లు పట్టింది. కాగా, మంగళవారంనాటి భూకంపం, సునామీల కారణంగా ఎంత మంది చనిపోయారు, ఏ మేరకు నష్టం వాటిల్లిందో తెలియాల్సిఉంది.