ఆ ఐటీ కంపెనీలో కొత్త ఉద్యోగాలు
ఆ ఐటీ కంపెనీలో కొత్త ఉద్యోగాలు
Published Mon, Mar 13 2017 8:35 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
న్యూఢిల్లీ : ఐటీ కంపెనీల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు కొత్త ఉద్యోగాలు వస్తాయో రావో అంటూ టెక్కీలు పడుతున్న ఆందోళనకు ఐటీ సెక్యురిటీ సంస్థ మెకాఫీ తీపి కబురు అందించింది. తన బెంగళూరు ఐటీ సెంటర్లో ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని యోచిస్తున్నట్టు ఈ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేకాక స్థానిక బిజినెస్లను మరింత పెంచుకోవడానికి ఇండియాలో పెట్టుబడులను కొనసాగిస్తామని చెప్పారు. గ్లోబల్ చిప్ మేకర్ ఇంటెల్ గత ఏడాది సెప్టెంబర్ లోనే 51 శాతం షేరుతో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ టీపీజీతో కలిసి మెకాఫీని ఓ ప్రత్యేక సంస్థగా రూపొందించింది. ఈ డీల్ 2017 రెండో క్వార్టర్లో ముగియనుంది.
''ప్రపంచంలో మాకున్న పెద్ద సైట్లలో బెంగళూరు ఒకటి. దానిలో పెట్టుబడులు కొనసాగిస్తాం. అక్కడ కొత్త కార్యకలాపాలను ప్రారంభిస్తాం'' అని ఇంటెల్ సెక్యురిటీ జనరల్ మేనేజర్ యంగ్ చెప్పారు. ఇంటెల్ కింద ఉన్నప్పుడు అది ప్రాథమిక అభివృద్ధి సంస్థగా ఉండేది. కానీ ప్రస్తుతం ఫైనాన్స్, ఐటీ, హెచ్ఆర్ వంటి కొత్త సైట్లను ఏర్పాటుచేసి, కొత్త యూనిట్ కు మద్దతిస్తామని వెల్లడించారు. అయితే ఎన్ని ఉద్యోగాలు సృష్టించబోతున్నారో ఆయన తెలుపలేదు. కొత్త ఉద్యోగాలు వస్తాయని మాత్రమే యంగ్ చెప్పారు. మెకాఫీ, ఇంటెల్ సెక్యురిటీ గ్రూప్ లో ఓ భాగం. 2016 నాటికి ఏడాదికి ఏడాది ఈ కంపెనీ 20 శాతం వృద్ధిని నమోదుచేస్తోంది. 2011లో మెకాఫీని ఇంటెల్ కొనుగోలు చేసింది.
Advertisement
Advertisement