మెల్ బోర్న్ మరోసారి...
కాన్ బెర్రా: ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. ఆవాసానికి అత్యంత అనువైన ప్రపంచ నగరాల్లో అగ్రశేణిలో నిలిచింది. ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన గ్లోబల్ సర్వేలో 140 నగరాలను అధిగమించి మెల్ బోర్న్ మొదటి స్థానం దక్కించుకుంది. విక్టోరియా రాష్ట్ర రాజధాని అయిన మెల్ బోర్న్ వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది.
సర్వేలో వైద్యం, విద్య, స్థిరత్వం, సంస్కృతి, పర్యావరణం, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 100 పాయింట్లుగానూ మెల్ బోర్న్ కు 97.5 స్కోరు దక్కింది. తక్కువ నేరాలు నమోదు కావడంతో మెల్ బోర్న్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఆస్ట్రియా రాజధాని వియన్నా(97.4), కెనడా నగరాలు వాంకోవర్(97.3), టొరంటో(97.2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరో ఆస్ట్రేలియా నగరం అడిలైడ్, కెనడా నగరం కాల్ గారీ సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాయి. టాప్-10లో ఏడు ఆస్ట్రేలియా, కెనడా నగరాలే ఉండడం విశేషం.