ప్రతీకారం తీర్చుకుంటారా!
న్యూయార్క్:శతవసంతాల కోపా అమెరికా ఫుట్ బాల్ కప్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. వందేళ్ల సుదీర్ఘ చరిత్రలో భాగంగా ఈ ఏడాది నిర్వహించిన కోపా అమెరికా కప్ రేపటితో ముగియనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అర్జెంటీనా-చిలీ జట్లు జరిగే తుది పోరులో తమ అదృష్టాన్నిపరీక్షించుకోనున్నాయి. భారత కాలమానప్రకారం సోమవారం ఉదయం గం.5.30 ని.లకు ఈస్ట్ రూథర్ఫర్డ్లోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
సెమీఫైనల్లో కొలంబియాపై 2-0తో విజయం సాధించి చిలీ ఫైనల్ కు చేరగా, అర్జెంటీనా 4-0 తేడాతో అమెరికాపై గెలిచి తుది పోరుకు సిద్ధమైంది. గతేడాది ఇదే టోర్నీలో ఈ రెండు జట్లే ఫైనల్ కు చేరగా చిలీ విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి కోపా అమెరికా కప్ ను అందుకుంది. అయితే మరోసారి టైటిల్ ను సాధించాలని చిలీ పట్టుదలగా ఉంది. ఫైనల్ కు చేరే క్రమంలో మేటి జట్లను సైతం మట్టికరిపించి ఫైనల్ కు చేరిన చిలీ మరో అడుగును దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కాగా, గతేడాది ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అర్జెంటీనా భావిస్తోంది. ఇప్పటివరకూ 14 సార్లు కోపా అమెరికా ట్రోఫీని అందుకున్న అర్జెంటీనా.. ఈసారి కోప్ కప్ ను గెలుచుకుని 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించడానికి సమాయత్తమవుతోంది. 1921లో తొలి టైటిల్ ను అందుకున్న అర్జెంటీనా.. 1993 లో చివరిసారి కోపా టైటిల్ ను సాధించింది. అయితే గత కొంతకాలంగా ప్రధాన టోర్నీల్లో మెస్సీ అండ్ గ్యాంగ్ చతికిలబడటం ఆ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. 2014లో వరల్డ్ కప్ ఫైనల్లో జర్మనీ చేతిలో పరాజయం చెందిన అర్జెంటీనా.. 2015 కోపా అమెరికా కప్ లో కూడా ఫైనల్ ఫోబియోను అధిగమించలేకపోయింది.
మరోవైపు అర్జెంటీనా జట్టు నాయకత్వంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. అర్జెంటీనా జట్టులో పోస్టర్ తరహా పాత్రను పోషిస్తూ ఫీల్డ్లో ఒక గొప్ప నాయకుడిగా మెస్సీ మన్ననలు అందుకుంటున్నాడంటూ మారడోనా మండిపడ్డాడు.. అతను తన క్యారెక్టర్ను కోల్పోయి జట్టుకు నాయకుడిగా మారాడని ధ్వజమెత్తాడు. అయితే అర్జెంటీనా ఫైనల్ కు చేరినా మారడోనా మాత్రం మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆదివారం నాటి పోరులో అర్జెంటీనా విజేతగా నిలిచి పరువు నిలుపుకోవాలన్నాడు. ఒకవేళ విజయం సాధించని పక్షంలో ఇప్పుడు వరకూ సాధించింది ఏమీ ఉండదంటూ మెస్సీ సేనకు హితబోధ చేశాడు. ఈ నేపథ్యంలో విజయంతోనే ఇంటా, బయటా సమాధానం చెప్పడానికి ఆ జట్టు సిద్ధమవుతోంది. దీంతో సుమారు ఎనభైవేల మంది ప్రేక్షక్షుల హాజరయ్యే తుది సమరం ఆసక్తికరంగా సాగి అవకాశం ఉంది.