'1700 మంది సైనికులను చంపాం'
తాము ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 1700 మంది ఇరాకీ సైనికులను చంపినట్లు అక్కడి ఉగ్రవాదులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి కొన్ని అత్యంత క్రూరంగా కనిపిస్తున్న ఫొటోలను కూడా వాళ్లు ట్విట్టర్లో పోస్ట చేశారు. అయితే, వాళ్లు చెబుతున్న విషయాలు గానీ, చూపిస్తున్న ఫొటోలు గానీ ఎంతవరకు నిజమనే విషయం ఇంతవరకు అధికారికంగా నిర్ధారణ కాలేదని ఇరాకీ ప్రభుత్వాధికారులు అంటున్నారు. ఉగ్రవాదులు సైనికులను హతమార్చామని చెబుతున్న సలాహుద్దీన్ రాష్ట్ర ప్రాంతంలో ఎక్కడా సామూహిక దహనాలు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు.
కానీ... ఒకవేళ ఉగ్రవాదులు చెబుతున్న విషయమే నిజం అయితే మాత్రం ఇది ఇప్పటివరకు సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఘోరమైన చర్య అవుతుంది. ఇంతకుముందు సిరియా శివార్లలోని డమాస్కస్ ప్రాంతంలో గత సంవత్సరం జరిగిన రసాయన దాడుల్లో సిరియా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న 1400 మంది మరణించారు. ఉగ్రవాదుల చేతుల్లోంచి రెండు పట్టణాలను విడిపించామని, వారిమీద తాము పైచేయి సాధించామని చెబుతున్న ప్రభుత్వ వర్గాలు ఈ కథనాలు చూసి కలవరపడుతున్నాయి.