పటన్ కుమార్ పొద్దార్ నాయక్
హైదరాబాద్: తీగలాగితే డొంక కదిలినట్లు మిలటరీ అధికారి పటన్ కుమార్ పొద్దార్ నాయక్ను ప్రశ్నిస్తుంటే అనేక విషయాలు బయటపడుతున్నాయి. గతంలో జమ్మూకాశ్మీర్, నాసిక్‌లలో పనిచేసిన పటన్ పోలీసుల విచారణలో పలు కీలక వివరాలు తెలిపాడు. పాకిస్థాన్ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు అనుష్క అగర్వాల్ అనే మహిళా ఉగ్రవాది ద్వారా దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సికింద్రాబాద్‌లోని ఈఎంఈ యూనిట్‌లో సుబేదార్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన పటన్‌కుమార్ పొద్దార్ నాయక్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలు: పొద్దార్ నాయక్కు అనుష్క అగర్వాల్తో 2013 నుంచి ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తున్నాడు. ఆర్మీ మిస్సైల్, ఆయుధ నిల్వల కర్మాగారం వివరాలను, ఫోటోలను పంపాలని అనుష్క అతనిని కోరింది. ఆర్మీకి సంబంధించిన కీలక వివరాలు, అధికారుల కదలకలను అతను అనుష్కకు పంపాడు. 40 మంది కీలక విభాగాల్లో అధికారుల వివరాలను కూడా అతను ఆమెకు తెలిపాడు. పతాన్ అకౌంట్‌లో ఆమె 5 సార్లు పది లక్షల రూపాయలను డిపాజిట్ చేసింది. దేశంలో ఉన్న 12 యూనిట్ల బ్రిగేడియర్‌ల పేర్లు, వారు ఉండే ప్రదేశాల వివరాలను ఆమెకు పంపాడు. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఆర్మీ సమాచారాన్ని కూడా నాయక్ ఫోన్‌లో ఆమెకు చెప్పాడు. భారత ఆర్మీ కీలక వివరాలు వెల్లడిస్తే లండన్ తీసుకెళ్తానని అతనికి అనుష్క చెప్పింది. పటన్ మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తుంటాడు. చైనాలో విదేశీ రాయబార కార్యాలయంలో ఉండే ధరమ్‌వీర్ సింగ్, సుబేదార్ బీఎస్ రెడ్డిలు అతనిని ఎమ్‌ఎల్‌ఎమ్ సెక్యూర్డ్ లైఫ్ వ్యాపారంలోకి ఆహ్వానించారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే పోద్దార్ నాయక్ నుంచి పోలీసులు కంప్యూటర్లు, ల్యాప్టాప్, పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు ఖాతాలోని 3 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ 3,4,5 సెక్షన్లు,1977 ప్రైజ్ చిట్స్ మనీ సర్క్యులేషన్ బాన్నింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్తో ఉందని పోలీసులు వెల్లడించారు. ఆమె భారత్కు చెందిన వ్యక్తా? లేక పాకిస్తాన్కు చెందిన వ్యక్తా? అనేది తెలియవలసి ఉంది. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతునట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.