'నన్ను ఎవరో చాకచక్యంగా ఇరికించారు'
హైదరాబాద్ : సైనిక రహస్యాలను ఉగ్రవాదులకు చేరవేసిన కేసులో రిమాండ్‌లో ఉన్న సైనికోద్యోగి పటన్ కుమార్ పొద్దార్ (40) గురువారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆగస్టు 3న అతన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయడం, బుధవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిలటరీ అధికారి మేజర్ రంజిత్ సంతకం చేసిన కీలక డాక్యుమెంట్లు పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరాయి.
ఈ డాక్యుమెంట్లను ఈ-మెయిల్ ద్వారా ఈ ఏడాది జూన్ 7న అనుష్క అగర్వాల్‌కు పటన్ పంపినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలోతేలింది. అనుష్క, పటన్‌లు ఉపయోగించిన ఫోన్ నంబర్లు ఎవరి పేర్లపై తీసుకున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కీలక ర హస్యాలను పటన్, అనుష్కకు చేరవేసినట్టు గుర్తించారు. ప్రతిఫలంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మంగళ్‌గిరి ఎస్బీఐ బ్రాంచ్‌లో ఉన్న అతని అకౌంట్‌కు దశలవారీగా అనుష్క అగర్వాల్ డబ్బులు పంపినట్లు తేలింది. ఆమె ఆదేశాల మేరకు పటన్ అకౌంట్‌లోకి డబ్బులు వేసిన ఆసీఫ్ అలీ మాత్రమే పోలీసులకు చిక్కాడు. మిగతా చోట్ల నుంచి పటన్ అకౌంట్‌లోకి డబ్బులు వేసిన వారు ఇంకా చిక్కలేదు.
నన్ను ఇరికించారు: పటన్
నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తున్న తనను ఎవరో చాకచక్యంగా ఈ కేసులో ఇరికించారని జైలు నుంచి విడుదలైన పటన్ కుమార్ పొద్దార్ 'సాక్షి' వద్ద వాపోయాడు. తన అకౌంట్‌లో ఎవరు డబ్బులు వేశారో తెలియదన్నారు. తనతో వెబ్ కెమెరాలో మాట్లాడినదీ, ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేసినదీ ఒకే యువతని చెప్పాడు.
కాగా ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థకు మన సైన్యానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చేరినట్టు తెలిసింది. దీంతో పాటు 'స్వీట్స్' అనే పదానికి అర్థాన్నీ మన పోలీసులు కనుగొన్నారు. దేశ సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేసిన కేసులో పట్టుబడిన పటన్ కుమార్ పొద్దార్, పాక్ ఐఎస్‌ఐ ఉగ్రవాది అనుష్క అగర్వాల్‌ల ఈ మెయిల్ సంభాషణలను పరిశీలించి... 'స్వీట్స్' అనే పదానికి మన పోలీసులు అర్థాన్ని తెలుసుకున్నారు.
సైనిక రహస్యాలను పంపినందుకు పటన్ బ్యాంక్ అకౌంట్‌కు అనుష్క అగర్వాల్ జూలై 22న 2014 సంవత్సరంలో రూ.20వేలు పంపించింది. అదే రోజు రాత్రి 11.30 గంటలకు చాటింగ్‌లో మాట్లాడుతూ తాను 'స్వీట్స్ పంపించాను చేరాయా?' అని అనుష్క అడిగింది. అందుకు పటన్ సమాధానం చెబుతూ సరే చూస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు తన అకౌంట్‌లో డబ్బులు ఉండడంతో ఆ విషయాన్ని చాటింగ్‌లో ఆమెకు చేరవేశాడు. ఈ సంభాషణతో 'స్వీట్స్' అనే పదానికి అర్థం 'డబ్బులు' అని తేలింది.