తప్పుడు లెక్కలతో తీరని అన్యాయం | Miscalculations will cause desperate injustice: YS Jagan slams TDP govt | Sakshi
Sakshi News home page

తప్పుడు లెక్కలతో తీరని అన్యాయం

Published Wed, Mar 8 2017 2:40 AM | Last Updated on Sat, Aug 18 2018 5:18 PM

తప్పుడు లెక్కలతో తీరని అన్యాయం - Sakshi

తప్పుడు లెక్కలతో తీరని అన్యాయం

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ధ్వజం
- కేంద్రానికి తప్పుడు సంకేతాలు వెళతాయి
- లేని వృద్ధి ఉన్నట్లు చూపితే నిధులెలా వస్తాయి?

- ఆంధ్రా ట్రంప్‌.. చంద్రబాబునాయుడు.. పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయి
- అవినీతిలో ఏపీని నంబర్‌ 1 చేశారు..
- బీకాంలో ఫిజిక్స్‌ చేసిన వారికి నా గణాంకాలు అర్థంకావు
- మూడేళ్లలో రైతుల పరిస్థితి దుర్భరం
- గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ ఏపీ ప్రతిపక్షనేత విమర్శలు


సాక్షి, అమరావతి

‘‘అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంకెలు మారుస్తోంది? ఎందుకు జీడీపీ తదితర గణాంకాలు తప్పుగా చూపిస్తోంది? మనం తప్పుడు లెక్కలు చూపించడం అంటే కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపడమే కదా. భారీగా జీడీపీ పెరిగినట్లు, పరిశ్రమలు పెరిగినట్లు చూపించాల్సిన అవసరం ఏమిటి? ఇలా చెబితే కేంద్రం ఎలా సహాయం చేస్తుంది? అంటే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లే కదా!’’అంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘జీడీపీలో లేని వృద్ధి ఉన్నట్లు చూపడమంటే.. పన్నుల ద్వారా ఆదాయం బాగానే వస్తుందని కేంద్రం భావిస్తుంది. అలాంటపుడు కేంద్రం మనకు ఎందుకు నిధులు ఇస్తుంది? రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబితే కేంద్రానికి ఎలాంటి సంకేతాలు వెళతాయి? ఇక ప్రత్యేకహోదా ఇవ్వనవసరం లేదని కేంద్రం భావించదా?  ఇది కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినట్లు కాదా?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌ ప్రసంగానికి యథావిధిగా అధికార పక్ష సభ్యులు పదే పదే ఆటంకాలు కలిగించారు. సభలో జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

మీకు వినే ఓపిక దేవుడు ప్రసాదించాలి...
‘‘కొత్తగా కట్టిన తాత్కాలిక అసెంబ్లీలో అత్యున్నత ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాలని కోరుకుంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నా. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ.. దానికి సంబంధించి నిజానిజాలను చర్చించడం కూడా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. నా ప్రసంగాన్ని కాస్త ఓపికగా, మధ్యలో మాటకోసారి అడ్డుకోకుండా వినే శక్తిని భగవంతుడు అధికారపక్షానికి ప్రసాదించాలని కోరుకుంటున్నా. నిమిషానికోసారి నా మైకు కట్‌ చేసే సంప్రదాయాన్ని ఈ కొత్త అసెంబ్లీలోనైనా వదిలేస్తారని, పార్లమెంటరీ సంప్రదాయాలకు విలువ ఇస్తారని, ప్రజాస్వామ్యంలో విమర్శలు ముఖ్యమనే విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నా.

బాబుగారి జీడీపీ దేవరహస్యం..
మన రాష్ట్రం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో విడిపోయిందో అందరికీ తెలుసు. హైదరాబాద్‌ మహానగరం కోల్పోయాం. అయినా 2015–16లో దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రమని చెబుతున్నారు. 2016–17 మొదటి అర్ధభాగంలో 12.23 శాతం వృద్ధిరేటు సాధించిందంటున్నారు. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం.. వీటి అన్నింటి విలువ కట్టి, అది గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే జీడీపీ వృద్ధి చెందినట్లు లెక్క. 2015–16లో రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధిరేటు చూపిస్తే, దేశంలో అదే సమయంలో 7.57 శాతం వృద్ధిరేటు ఉంది. దేశం కన్నా మనం 5 శాతం ఎక్కువ సాధించామని చెప్పుకున్నాం. చెన్నైతో కూడిన తమిళనాడు వృద్ధిరేటు 8.79శాతం, బెంగళూరుతో కూడిన కర్ణాటక వృద్ధిరేటు 6.2 శాతం. ముంబైతో కూడిన మహారాష్ట్ర వృద్ధిరేటు 8 శాతం. చివరకు అహ్మదాబాద్‌తో కూడిన గుజరాత్‌ వృద్ధిరేటు కూడా  7.7 శాతమే. కానీ చంద్రబాబు ఆధ్వర్యంలో మన వృద్ధిరేటు 10.99 శాతం. వారెవ్వా.. ఈ ఘనత నిజంగా దేవరహస్యం.

బీకాంలో ఫిజిక్స్‌ చదివినవారికి ఈ లెక్కలు అర్ధం కావు..
జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం 30 శాతం ఉంటుంది. మొత్తం జీఎస్‌డీపీ రూ.6.03 లక్షల కోట్లు అయితే అందులో రూ.1.77 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి సంబంధించినవి. అభివృద్ధి 10.99 శాతంగా చూపిస్తూ ఆక్వా రంగం 2015–16లో 31 శాతం అభివృద్ధి చెందిందని, ఈ ఏడాది 42 శాతం అభివృద్ధి జరగబోతోందని అన్నారు. ఆక్వారంగ వృద్ధి అనేది చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఉన్నట్టుండి వచ్చింది కాదు, ముందునుంచి ఉంది. 2012–13లో రాష్ట్రంలో 15.88 లక్షల టన్నులు, 2013–14లో 17.69 లక్షల టన్నులు, 2014–15లో 19.78 లక్షల టన్నులు, 2015–16లో సుమారు 20 లక్షల టన్నులు రొయ్యల ఉత్పత్తి ఉంది. అంటే ప్రతి సంవత్సరం ఉత్పత్తి పెరుగుతున్న విషయాన్నే.. రొటీన్‌గా జరుగుతున్న విషయాలను భూతద్దంలో చూపించి, దానివల్ల 11 శాతం వృద్ధిరేటు సాధించామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. బీకాంలో ఫిజిక్స్‌ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కాకపోవచ్చు. చంద్రబాబు గారి గ్రహబలం ఏంటో నాకు తెలియదు గానీ.. భూమ్మీద పండించే రైతులకు మద్దతు ధర దేవుడెరుగు, నీళ్లలో పెరిగే చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి.

పెట్టుబడులపై బడాయి కబుర్లు
రెండేళ్లలోనే రూ.15 లక్షల కోట్ల ఎంఓయూల మీద సంతకాలు చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు. రూ.4.67 లక్షల కోట్ల ఒప్పందాల మీద సంతకాలు చేశారని చెప్పారు. రూ.1.93 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయని కూడా చెప్పారు. 2015–16 సోషియో ఎకనమిక్‌ సర్వే ప్రకారం 2014–15లో భారీ పరిశ్రమలు రూ.1,875 కోట్లు, చిన్న పరిశ్రమలు రూ.2,263 కోట్లు .. మొత్తం రూ.4,138 కోట్లు పెట్టుబడులే వచ్చాయి. 2015–16లో భారీ పరిశ్రమలు రూ.3,963 కోట్లు, చిన్నవి రూ.1,562 కోట్లు, మొత్తం రూ.5,561 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. పరిశ్రమలు వచ్చాయో లేదో తెలుసుకోడానికి రెండో పారామీటర్‌.. పరిశ్రమలకు అనుమతులు. ఐఈఎం ఫైల్‌ చేస్తేనే అన్నిరకాల అనుమతులు వస్తాయి, అలాగని మొత్తం ఐఈఎంలన్నీ అమలవుతాయని లేదు. వాటిలో 10–20 శాతం పరిశ్రమలు మాత్రమే వస్తాయి. 2014లో రూ.21,510 కోట్లు ఫైల్‌ చేస్తే, వాటిలో రూ.2,804 కోట్లు మాత్రమే అమలయ్యాయి. 2015లో రూ.21,137 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు దరఖాస్తు చేసుకోగా రూ.4,542 కోట్లు పెట్టుబడులు అమల్లోకి వచ్చాయి. 2016లో రూ.34,464 కోట్లు ఫైల్‌ చేస్తే, వాటిలో రూ.11,395 కోట్లు మాత్రమే అమలయ్యాయి.   

బాబు బండారం బయటపెట్టిన సత్యనాదెళ్ల..
జీఎస్‌డీపీలో సేవల రంగం వాటా 46శాతం. మిగిలిన వారికంటే మన రాష్ట్రం తక్కువుంది ఒక్క ఐటీ రంగంలోనే.. హైదరాబాద్‌లోనే ఐటీ రంగం 98శాతం ఉంది. గత మూడేళ్ల కాలంలో ఐటీ రంగానికి సంబంధించి చంద్రబాబునాయుడు గొప్పలు చెబుతున్నారు. సత్యనాదెళ్లకు తానే స్ఫూర్తి అంటారు. తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవో అయ్యాడంటారు. అమరావతిలో 11వ మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి కేంద్రం స్థాపించడానికి సత్యనాదెళ్ల అంగీకరించారని చంద్రబాబు చేసిన ప్రకటన అక్టోబర్‌ 21న కొన్ని పత్రికల్లో వచ్చింది. కానీ, ఆయన అలా చెప్పిన కొన్ని గంటల్లోనే సత్య నాదెళ్ల తాము రావడం లేదని, కంపెనీ పెట్టడం లేదని ప్రకటించారు. ట్రంప్‌ పేరు చెబితే భారతీయులు భయపడినట్లు చంద్రబాబు పేరు చెబితే భారతీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా భయపడుతున్నాయి. ఎన్‌సీఏఈఆర్‌ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్‌ 1 ర్యాంకు ఇచ్చినందువల్లే ఆ సంస్థలు అలా వణికిపోతున్నాయి.

తప్పుడు లెక్కలతో కేంద్రం శీతకన్ను
దేశంలో ఎక్కడైనా జీఎస్‌డీపీ వృద్ధి రేటు కంటే రెవెన్యూ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. జీఎస్‌డీపీ పెరిగితే పన్నుల ఆదాయం పెరుగుతుందన్నది ఎకనమిక్‌ ఫినామినా. 2004 నుంచి 2016–17 వరకు 13 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి. కానీ మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు హయాంలో ఇది రివర్స్‌గేర్‌లో ఉంది.  2004–05 18%, 2005–06 18%, 2006–07 25% ఇలా ప్రతి ఏడాది జీఎస్డీపీ గ్రోత్‌ రేటు కంటే రెవిన్యూ గ్రోత్‌ రేటు పెరిగింది. ఒక్క చంద్రబాబు హయాంలోనే ఈ గణాంకాలు రివర్స్‌ అయ్యాయి. 2015–16లో జీఎస్‌డీపీ వృద్ధి రేటు 10.99 శాతం కాగా.. రెవెన్యూ వృద్ధి రేటు 3.39 శాతం మాత్రమే కావడం గమనార్హం. అంకెలు మార్చి.. జీఎస్‌డీపీ భారీగా పెరిగినట్లు చూపడమంటే కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపినట్లు కాదా? భారీగా వ్యవసాయ వృద్ధి రేటు నమోదైందని.. పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటే కేంద్రం ఏమనుకుంటుంది.. రాష్ట్రం తన కాళ్లపై తాను నిలబడగలదని  కేంద్రం అనుకోదా? రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్రమే చెబుతున్నప్పుడు.. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రం భావించదా?’’ అని ప్రశ్నిస్తూ వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగానే అర్థాంతరంగా మైకును కట్‌ చేసిన స్పీకర్‌ సభను ఈ నెల(మార్చి) 13వరకు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement