అంబేడ్కర్ విగ్రహం.. దుస్థితి దారుణం?
♦ శాసనసభ ఆవరణలో దుమ్ముపట్టిన బాబాసాహెబ్ విగ్రహం
♦ నివాళులర్పించకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభలో టీడీపీ ప్రభుత్వం అంబేడ్కర్ మహాశయుని గొప్పతనం, ఘనత, సేవల గురించి ఓవైపు చర్చిస్తూ ఉండగా అదే శాసనసభా ప్రాంగణంలో కొలువైన బాబా సాహెబ్ విగ్రహానికి దుమ్మూధూళి పట్టి ఉండటం గమనార్హం. విగ్రహాన్ని శుభ్రం చేసి, పూలదండ వేసిన పాపాన పోలేదు ప్రభుత్వం. శుక్రవారం కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌పై చర్చ కోసం పట్టుబట్టి సభ నుంచి సస్పెండైన అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణం వద్ద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బైఠాయించినపుడు ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఈ విషయాన్ని అందరి దృష్టికి తెచ్చారు. ‘విగ్రహం దుమ్మూధూళి పట్టి.. ఎలా ఉందో చూడండి.
విగ్రహం మెడ లో ఉన్న పూలమాల కూడా ఎండిపోయింది. కనీసం శుభ్రం చేయించాలన్న ఆలోచనైనా లేదు చంద్రబాబుకు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అంబేడ్కర్ గురించి సభలో పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు గానీ, ఇక్కడ మాత్రం ఆయన విగ్రహం ఎలా ఉందో కూడా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని కొడాలి నాని పేర్కొన్నారు. జగన్ కూడా ఇదే అంశాన్ని మీడియాకు చూపుతూ ‘చూడండి...బయట అంబేడ్కర్ విగ్రహం ఎలా ఉందో పట్టించుకోరు?’ అని అన్నారు.
నివాళులర్పించే స్చేచ్ఛ కూడా లేదా : శాసనసభా ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహం వైపునకు వెళ్లడానికి ఉద్యుక్తులైన ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. శుక్రవారం అంబేడ్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడానికి అసెంబ్లీ కార్యదర్శి నుంచి వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం తరపున అనుమతి పొందారు. అనుమతినిచ్చిన తరువాత సిబ్బంది వచ్చి విగ్రహం వద్ద తెరిచి ఉన్న గ్రిల్ గేట్లకు తాళం వేసుకొని వెళ్లి పోయారు.
వైఎస్ జగన్‌తో సహా ఎమ్మెల్యేలందరూ వచ్చి తాళం తీయాల్సిందిగా కోరగా సిబ్బంది పత్తా లేకుండా పోయారు. గ్రిల్ గేట్లను తోసుకొని వెళ్లాలని ఎమ్మెల్యేలంతా ముందుకురాగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి తీసుకున్నా ఎందుకు వెళ్లనివ్వరు? ఇది మంచి పద్ధతి కాదు.. నివాళులర్పించే స్వేచ్ఛ కూడా లేదా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? అని వైఎస్ జగన్ మండిపడ్డారు. చివరకు కొడాలి నాని, పి.అనిల్‌కుమార్ యాదవ్, కొరుముట్ల శ్రీనివాసులు, షేక్ ముస్తఫా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒక్కొక్కరుగా ఎత్తయిన గేట్లపైకి ఎక్కి విగ్రహం ఉన్న ఆవరణలోకి దూకేశారు. విగ్రహం వద్దకు చేరుకొని పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.