మిస్త్రీ సెక్యూరిటీ, మీడియా ఘర్షణ
ముంబై: రచ్చకెక్కిన టాటా-మిస్త్రీ బోర్డ్ రూం వ్యవహారంలో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మిస్త్రీ సెక్యూరిటీకి, మీడియాకు మధ్య చిన్నపాటి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ బోర్డ్ మీటింగ్ సందర్భంగా శుక్రవారం టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సెక్యూరిటీకి మీడియాకు మధ్య ఘర్షణలో ఇరువర్గాలు గాయపడ్డాయి.
ఐహెచ్సీఎల్ చైర్మన్ కూడా అయిన మిస్త్రీ కంపెనీ త్రైమాసిక ఆర్థిక సమీక్షా సమావేశానికి టాటా ప్రధాన కార్యాలయానికి చేరుకోగానే ఫోటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఇంతలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పరిస్థితి అదుపుతప్పడంతో పలు జాతీయ మీడియాకు చెందిన కెమెరాలు దెబ్బతిన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది, ఫోటో గ్రాఫర్లకు గాయాలయ్యాయి. చివరికి మాతా రమాబాయి పోలీస్ స్టేషన్ పోలీసులు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం గాయపడిన సెక్యూరిటీ సిబ్బందిని, ముగ్గురు ఫోటో గ్రాఫర్లను వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు.
కాగా టాటా సన్స్ ఛైర్మన్ గా తొలగించినప్పటికీ, టాటా గ్రూపు సంస్థలకు మిస్త్రీ ఛైర్మన్ గాకొనసాగుతారని మిస్త్రీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా టాటా స్టీల్ , టాటా మోటార్స్ లాంటి టాటా గ్రూప్ అన్ని పదవులకూ చట్టానికి లోబడి తన విశ్వసనీయ బాధ్యతను నిర్వర్తిస్తారని చెప్పారు.