మోదీకి కౌన్సెలింగ్ ఇవ్వాలి
సభలకు నిధులపై దర్యాప్తు జరిపించాలి: కాంగ్రెస్
♦ తల్లిపై ప్రేమ ఉంటే.. తన దగ్గర ఎందుకు ఉంచుకోవటంలేదు?
న్యూఢిల్లీ : ప్రధాని మోదీకి మానసికంగా కౌన్సెలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అమెరికాలో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ఆదివారం చేసిన ప్రసంగంలో రాజకీయాలను అట్టడుగు స్థాయికి దిగజార్చారని ఆరోపించింది. కాంగ్రెస్‌ను, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై మోదీ పరోక్ష ఆరోపణలు చేయటంపై కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్‌శర్మ మండిపడ్డారు. ప్రధాని విదేశీ పర్యటనలలో ఏర్పాటు చేస్తున్న సభలకు మిలియన్ల కొద్దీ అవుతున్న డాలర్ల ఖర్చుపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ఫేస్‌బుక్ టౌన్‌హాల్‌లో మోదీ తన తల్లిని గురించి భావోద్వేగానికి గురి కావటంపైనాశర్మ విమర్శలు గుప్పించారు. మోదీ చెప్పేవి అబద్ధాలని, నిజానికి చిన్నతనంలో మోదీ తన మామ క్యాంటీన్‌లో కౌంటర్‌పై కూర్చొనేవాడని వివరించారు. మోదీ తనను తాను చాలా శక్తిమంతుడైన నాయకుడిగా భావిస్తారని.. అలాంటి నాయకుడు తన తల్లిని తన దగ్గర ఎందుకు ఉంచుకోరని ప్రశ్నించారు. కాగా, తన తల్లి అంటే మోదీకి ఎంతో భక్తి అనీ, మోదీ తన తల్లిని గుర్తుకు తెచ్చుకోవటంలో కంటతడి పెట్టడాన్ని సైతం కాంగ్రెస్ నీచమైన పద్ధతిలో వ్యాఖ్యానించటం దారుణమని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ ఆరోపించారు.