మోదీ.. థర్డ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్!
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యంత విజయవంతమైన మూడో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహా అభిప్రాయపడ్డారు. 66 ఏళ్ల మోదీ ఛరిష్మా, అప్పీల్.. ప్రాంతాలు, కులాలు, భాషలకు అతీతంగా దేశమంతా పాకిపోయిందని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ భారతీయ సదస్సు-2017లో గుహా ప్రసంగిస్తూ మోదీ ఆధిపత్యం, ఆయన విశాల భారత దృక్పథం ఆయనను నెహ్రూ, ఇందిర సరసన నిలబెట్టాయని పేర్కొన్నారు. 'నరేంద్రమోదీ భారత చరిత్రలో మూడో అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రిగా నిలువబోతున్న లేదా నిలిచిన కాలంలో మనం నివసిస్తున్నాం. ఆయన కలిగి ఉన్న అధికారం, సమగ్ర భారతీయ దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుంటే నెహ్రూ, ఇందిరల సరసన ఆయనను నిలబెట్టగలం' అని అన్నారు. 'నెహ్రూ, ఇందిర తర్వాత అంతటి అధికార ఆధిపత్యం, ఛరిష్మా, ప్రాంతాలు, కులాలు, భాషలకతీతంగా అపీల్ కలిగిన ప్రధానమంత్రి మరొకరు లేరు' అని గుహా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించవద్దంటూ తనకు బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయని కొన్నిరోజుల కిందట గుహా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.