పెద్దనోట్ల రద్దుపై రిలయన్స్ అధినేత అంబానీ..
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఎప్పటినుంచో ఊరిస్తున్న ఆ శుభవార్త ను అధికారికంగా వెల్లడించారు. సంచలన జియో ఆఫర్ ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ జియో ఖాతాదారులకు బంపర్ఆఫర్ ఇచ్చారు. గురువారం జరిగిన వాటాదారుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పెద్ద నోట్ల రద్దుపై తొలిసారి స్పందించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ పట్ల హర్షం ప్రకటించారు. ఇందుకు ప్రధానికి అభినందనలు తెలిపిన రిలయన్స్ అధినేత ప్రధాని నిర్ణయం చాలా విశాలమైందనీ కొనియాడారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనివలన సామాన్య ప్రజలు లబ్ది పొందుతారనీ,మార్పుకు సాయపడుతుందని పేర్కొన్నారు.
దీంతో పాటు నగదు రహిత లావాదేవీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. డిజిటల్ సేవలు ఆర్థిక వృద్ధికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. లావాదేవీల్లో అపూర్వమైన పారదర్శక, జవాబుదారీతనం తీసుకురావడం దీనికి దోహదపడుతుందన్నారు. 'హ్యాపీ న్యూయర్ ప్లాన్' పేరుతో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంల ద్వారా వేగంగా జియో మనీ సేవల్ని వేగంగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు జియో కస్టమర్లకు ఇతర టెలికాం నెట్ వర్క్ లు సహకరించడం లేదని ఆరోపించారు.
ఆయన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు:
- 2017 మార్చి 31 వరకూ డేటా, వాయిస్ కాల్స్ అన్నీ ఫ్రీ
- ఆధార్ ఆధారంగా 5 నిమిషాల్లో జియో సిమ్ యాక్టివేషన్
- కాల్ డ్రాప్ సమస్యల 90 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది.
- హ్యాపీ న్యూయర్ ప్లాన్‌తో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ
- ప్రతి రోజూ 1 జిబి వరకూ ఉచితంగా వాడుకోవచ్చు
- 2016 డిసెంబర్ 4 నుంచి 2017 మార్చి 31 వరకూ ఫ్రీ
- కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లకి వర్తించే జియో ఆఫర్
- జియో మనీతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్