నా కుమారుడు నిర్దోషి... | My son is innocent, says former CBI chief | Sakshi
Sakshi News home page

నా కుమారుడు నిర్దోషి...

Published Thu, Feb 25 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

నా కుమారుడు నిర్దోషి...

నా కుమారుడు నిర్దోషి...

* ఆధారాలతో రుజువు చేస్తాం: సీబీఐ మాజీ డెరైక్టర్ విజయరామారావు
* శ్రీనివాస్ కల్యాణ్ నా కొడుకు కాకపోతే ఇంత ప్రచారం ఉండేదా?
* సీబీఐ కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టడం లేదు
* ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగానే దోషి కాదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్: ‘‘నా కుమారుడు శ్రీనివాస్ కల్యాణ్ డాషింగ్ యంగ్‌మన్. తప్పుడు పనులు చేసేవాడు కాదు. మంచి ఆలోచనలు ఉన్నవాడు. నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు. వాస్తవాలేమిటో ఆధారాలతో సహా ఏ కోర్టులోనైనా నిరూపించుకునేందుకు మేం సిద్ధం.

కొన్ని వాస్తవాలు నాకు తెలిసినా... ఇప్పుడు బహిర్గతం చేయలేను. బ్యాంకు రుణం విషయంలో సీబీఐ నా కుమారుడి మీద కేసు నమోదు చేసిన మాట వాస్తవం. ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగానే దోషి కాదు’ అని సీబీఐ మాజీ డెరైక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు శ్రీనివాస్ కల్యాణ్‌రావుపై బ్యాంకు రుణం ఎగవేత కేసుకు సంబంధించి వివరణ ఇచ్చారు.

సీబీఐ కేసు వివరాలు వెల్లడించకుండా, సీబీఐని తప్పుపట్టకుండా, కేంద్ర మంత్రి సుజనా చౌదరిపైగానీ, టీడీపీ నేతలపైగానీ ఆరోపణలు చేయకుండా... మీడియా అడిగిన ప్రశ్నలకు ఆచితూచి సమాధానాలిచ్చారు. ఆవేదనతో కూడిన స్వరంతో తన కుమారుడు నిజాయితీపరుడు, నిర్దోషని చెప్పేందుకు విజయరామారావు ప్రయత్నించారు. శ్రీనివాస్ కల్యాణ్ తన కుమారుడు కావడం వల్లే ఇంత ప్రచారం జరిగిందన్నారు. బ్యాంకును మోసం చేసి రూ.304 కోట్లు ఎగ్గొట్టారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించారని, అందుకే తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు.

‘మీరు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినందుకు కుట్రలో భాగంగానే శ్రీనివాస్ కల్యాణ్‌ను సీబీఐ కేసులో ఇరికించారా?..’ అన్న ప్రశ్నకు ‘ఏదీ కాదనలేను.. ఏదీ ఔననలేను..’ అని సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఈ కేసులో ఇరికించారా? అని ప్రశ్నించగా... ‘నేనెవరి పేరు చెప్పలేను’ అన్నారు. సుజనా చౌదరి నుంచి మీకు బెదిరింపులు వచ్చాయా అని అడిగితే... ‘అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా?’ అని ఎదురు ప్రశ్నించారు. సీబీఐ తప్పుడు కేసు నమోదు చేసిందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా... ‘‘సీబీఐకి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసింది.

తప్పుడు కేసు నమోదు చేసిందని అనను. అయితే నమోదు చేసిన కేసు ఎంత వరకు నిజమనే విషయం దర్యాప్తులో తేలుతుంది. నేను సీబీఐ డెరైక్టర్‌గా పనిచేశాను కాబట్టే ఈ కేసుకు ఇంత ప్రచారం వచ్చింది. నా కుమారుడు కావడమే శ్రీనివాస్ కల్యాణ్ తప్పయింది..’’ అని విజయరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు గురించి మాజీ డెరైక్టర్‌గా మీకు తెలిసిందేమిటని అడగగా... తనకేమీ తెలియదని, ఒక తండ్రిగా తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు.

తాను సీబీఐతో ఏమీ మాట్లాడలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. తన కుమారుడు ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నాడని తెలిపారు. తనకు ఆస్తులేవీ లేవని, హైదరాబాద్‌లోని ఇల్లు, సొంత ఊళ్లో వ్యవసాయ భూములు తప్ప ఏమీ లేవని... వాటిని తన ఖా పెట్టినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. తన కుమారుడికి పంట రుణాలు తప్ప ఏ బ్యాంకులోనూ ఇతర రుణాలేవీ లేవని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement