సూరత్ అత్యాచారం కేసులో నిందితుడు, ఆశారాం బాపు కుమారుడు నారాయణ సాయిని అరెస్ట్ చేసినట్లు న్యూఢిల్లీ పోలీసులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు రోహిణి కోర్టులో నారాయణ సాయిని హాజరు పరుస్తామని తెలిపారు. న్యూఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లో నారాయణ సాయితో అతడి స్నేహితులతో ఉండగా న్యూఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గత 58 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న నారాయణ సాయిని గుజరాత్, పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన గాలింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసినట్లు వివరించారు.
2001- 2005 మధ్య కాలంలో ఆశారాం బాపు కుమారుడు నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్లోని సూరత్ నగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే 2000 సంవత్సరంలో ఆశారాం బాపు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తమపై బాపు ఆయన కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని గుజరాత్కు చెందిన ఇద్దరు సోదరిమణులు స్థానిక పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో నారాయణ సాయిని వెంటనే అరెస్ట్ చేయాలని నవంబర్ 24న పోలీసులను గుజరాత్ హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో నిందితుడు నారాయణ సాయిని అరెస్ట్ చేసేందుకు గుజరాత్ పోలీసులు న్యూఢిల్లీ, పంజాబ్ పోలీసుల సహాయం తీసుకున్నారు.