
మోడీవన్నీ అసత్యాలే: ప్రధాని
జబల్‌పూర్(మధ్యప్రదేశ్): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలు వల్లె వేస్తున్నారని, రాజకీయ లబ్ధికోసం వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు. ప్రధాని ఆదివారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో మాట్లాడారు. రాజకీయాల స్థాయిని బీజేపీ దిగజార్చుతోందని, రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని దుయ్యబట్టారు. ఇతరులను అప్రతిష్టపాలు చేయడంపైనే దృష్టి పెట్టే పార్టీ(బీజేపీ) దేశానికి ఏం చేయగలదన్న విషయాన్ని ఆలోచించాలని ప్రజలను కోరారు. ‘‘ఇతరులను అప్రతిష్టపాలు చేయడంలో తనకున్న ఉత్సాహాన్ని చూపుతూ బీజేపీకి చెందిన ఓ అగ్ర నేత అసత్యాలను వల్లె వేస్తున్నారు. చారిత్రక అంశాలను సైతం వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్‌పై దాడి చేయాలన్న ఆత్రుతతో బీజేపీలో సైతం అనేకమంది గౌరవించే నేత గురించిన వాస్తవాలను తప్పుగా చెబుతున్నారు’’ అంటూ మోడీపై విరుచుకుపడ్డారు. ఇతర నేతలపై వ్యక్తిగతంగా దాడి చేయడంపైనే బీజేపీ ఆసక్తి చూపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
మోడీకి ట్యూషన్ పెట్టించండి: దిగ్విజయ్
ఇండోర్: నరేంద్ర మోడీకి చరిత్ర పాఠాలు నేర్పించేందుకు ట్యూషన్ పెట్టించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ బీజేపీకి సూచించారు. శనివారం ఆజాద్‌నగర్‌లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ...‘ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థికి స్కూల్ స్థాయిలో చదువుకున్న చరిత్రపై కనీస అవగాహన లేదు’ అని విమర్శించారు.