సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై అత్యాచారం.. హత్య: ముగ్గురికి మరణశిక్ష
ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హతమార్చిన కేసులో ముగ్గురు దోషులకు పుణె శివాజీనగర్ కోర్టు మరణశిక్ష విధించింది. నయనా పూజారి (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులేనని స్పెషల్ జడ్జి ఎల్ఎల్ యెంకర్ సోమవారమే తేల్చారు. మంగళవారం నాడు వారు ముగ్గురికీ ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. ఈ ముగ్గురిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య, ఒకే రకమైన ఉద్దేశంతో నేరపూరిత కుట్రకు పాల్పడి ఆస్తులు దుర్వినియోగం చేయడం లాంటి నేరాలు నిరూపితమయ్యాయి. హత్య చేయాలన్న ఉద్దేశంతో అపహరించడం, దోపిడీ చేసే సమయంలో గాయపర్చడం, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం అనే ఆరోపణలు మాత్రం ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యం చూపించకపోవడంతో నిరూపితం కాలేదు.
ఖరాడి ప్రాంతంలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసే నయనా పూజారి 2009 అక్టోబర్ 7న ఆఫీసు నుంచి తిరిగి రావడానికి వేచి చూస్తుండగా కిడ్నాప్ అయింది. రెండు రోజుల తర్వాత పుణె జిల్లా ఖేడ్ తహసీల్‌లోని జరేవాడీ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం బయటపడింది. బాధితురాలిని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక కారులో ఆమెపై అత్యాచారం చేశారని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. ఆమె వద్ద ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు దొంగిలించారని, తర్వాత పీక పిసికి చంపేసి అడవిలో పారేశారని అన్నారు. నయనా పూజారి ఘటన తర్వాతే ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేసే మహిళలకు భద్రత కరువైన అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.