బీజేపీకి మద్దతిస్తాం: ఎన్సీపీ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోపక్క రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపింది. ఈ మేరకు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. కాంగ్రెస్ తో మైత్రి చెడిపోవడంతో ఈ ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేసింది.
కాగా ఎన్పీపీ మద్దతు బీజేపీ తీసుకుంటుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సహజ మిత్రపక్షమైన శివసేన వైపే బీజేపీ మొగ్గుచూపే అవకాశముందంటున్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.