
అధికారమిస్తే.. నల్లధనం తెప్పిస్తాం!
జైపూర్/బికనూర్(రాజస్థాన్): బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే విదేశీ బ్యాంకుల్లోని నల్లధనాన్ని తిరిగి తెప్పించేందుకు చట్టం రూపొందిస్తామని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రకటించారు. అవినీతిపరులు విదేశాల్లో డబ్బులు దాచుకోవడాన్ని అడ్డుకోవడమే బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంటుందన్నారు. జుంజ్‌హును జిల్లా ఖేత్రీలో, బికనూర్ డివిజన్‌లో మోడీ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై మోడీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ పనితీరును ఎన్డీఏ హయాంతో పోలుస్తూ విమర్శలు సంధించారు. ‘అటల్‌జీ అణు పరీక్షలు నిర్వహించారు.
ప్రపంచం షాక్ తిని ఆంక్షలు విధించింది. అయినా ఆయన రూపాయి విలువను పడిపోనివ్వలేదు. అప్పుడు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది. ఇప్పుడు ఆర్థికవేత్తయిన ప్రధాని పాలనలో ఏం జరుగుతోందో చూడండి.. రూపాయి ఐసీయూలో ఉంది’ అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్‌తో వ్యవహరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు. ‘ఒకవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం మన సైనికులను దారుణంగా చంపుతూ ఉంటే.. మరోవైపు ఆ దేశ ప్రధానికి మన దగ్గర విందు ఏర్పాటు చేస్తారు’ అన్నారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘గుజరాత్, రాజస్థాన్‌లకు సారూప్యత ఉంది. ఇక్కడా ఎడారి ఉంది. వర్షాలు తక్కువ. అయితే మేం 900 గ్రామాలకు, సరిహద్దులోని సైనికులకు మంచినీరు ఇవ్వడానికి కోట్లు ఖర్చు చేసి పైప్‌లైన్ వేశాం. అదెంత పెద్దదంటే గెహ్లాట్ , ఆయన కుటుంబం మారుతీ కారులో కూర్చుని వెళ్లేటంత పెద్దది’ అని అన్నారు.