మోదీతో నాకు కెమిస్ట్రీ ఉంది!
కఠ్మాండు: భారత్-నేపాల్ మధ్య పరస్పర విశ్వాస పునరుద్ధరణ తన తాజా పర్యటన ప్రధాన ఉద్దేశమని నేపాల్ నూతన ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ (ప్రచండ) తెలిపారు. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 15 నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓ భారతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన తాజా భారత పర్యటనపై నెలకొన్న ఆకాంక్షలు, అంచనాలు, ఇరుదేశాల సంబంధాల్లో చైనా పాత్ర తదితర అంశాలను ప్రస్తావించారు. గత ఏడాదికాలంగా భారత్-నేపాల్ మధ్య సంబంధాలు అంత బాగాలేవని ఒప్పుకొన్న ఆయన.. ప్రధాని మోదీపై తనకు వ్యక్తిగతంగా నమ్మకం ఉందని, ఆ విశ్వాసం పునాదిగా సంబంధాలు బలోపేతం చేసుకుంటామని చెప్పారు. పొరుగు దేశాలైన భారత్-నేపాల్ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగు పడుతున్నాయని చెప్పారు.
'మోదీజీ నేను ఒకే రకంగా ఆలోచిస్తాం. మా మధ్య కెమిస్ట్రీ ఉంది. మా సిద్ధాంతాలలో, ఎదుర్కొన్న పరిస్థితుల్లో వైరుద్ధ్యం ఉండవచ్చు. కానీ అది వేరే విషయం. భారీ మెజారిటీతో గెలిచిన ఆయన భారత్‌కు బలమైన ప్రధానమంత్రి. ఆయనను నేపాలీ ప్రజలు, నేను నమ్ముతున్నాం. ఇప్పుడు మేం ఈ విశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది' అని సీనియర్ మావోయిస్టు నాయకుడైన ప్రచండ చెప్పారు. భారత్-నేపాల్ సంబంధాల్లో చైనా పెద్ద విషయం కాబోదని ఆయన పేర్కొన్నారు. భావజాలపరంగా మీరు చైనాకు సన్నిహితమా? అని ప్రశ్నించగా.. 'చైనా ఎలాంటి భావజాలాన్ని కొనసాగిస్తున్నదని నేను అనుకోవడం లేదు. వారికి వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలే ముఖ్యం' అని చెప్పారు.