
విండోస్ లోపాలతోనే!
విండోస్ సాఫ్ట్‌వేర్‌లో గతంలో వెలుగుచూసిన లోపాల కారణంగానే తాజా సైబర్ దాడి జరిగినట్లు అంతర్జాతీయ కంప్యూటర్ భద్రతా నిపుణులు అభిప్రాయపడ్డారు.
⇔ ఉక్రెయిన్ ప్రాథమిక లక్ష్యం
⇔ ‘పెట్యా’కు కారణాలు విశ్లేషించిన అంతర్జాతీయ సైబర్ నిపుణులు
⇔ ముంబై చేరుకున్న జాతీయ సైబర్ భద్రతా సలహాదారు
శాన్‌ఫ్రాన్సిస్కో: విండోస్ సాఫ్ట్‌వేర్‌లో గతంలో వెలుగుచూసిన లోపాల కారణంగానే తాజా సైబర్ దాడి జరిగినట్లు అంతర్జాతీయ కంప్యూటర్ భద్రతా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉక్రెయిన్‌ను ప్రాథమిక లక్ష్యంగా ఎంచుకున్నట్లు చెప్పా రు. ‘పెట్యా’ రాన్సమ్‌వేర్ కారణంగా ఉక్రెయిన్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైరస్ ప్రభావం భారత్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలను తాకింది. పెట్యా ప్రభావానికి గురైన తమ టర్మినల్ నుంచి సరకు రవాణాను దారి మళ్లించాలని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్(జేఎన్‌పీటీ) నిర్వహణ సంస్థ ఏపీ మొల్లర్–మాయిరెస్క్(ఏపీఎం)ను కోరింది.
మూలం ఉక్రెయిన్‌లోనే: పెట్యా వైరస్ కంప్యూటర్లలోకి ఎలా ప్రవేశించిందన్న దానిపై స్పష్టత రాలేదు. అందుకు ఈమెయిల్‌ను ఉపయోగించారని నిరూపించలేమని సిస్కో టాలోస్ నిఘా సంస్థ పేర్కొంది. సైబర్ దాడి జరగడానికి లొసుగులు, వాటి నుంచి ప్రయోజనం పొందడానికి ఉన్న మార్గాల గురించి గతంలోనే యూఎస్ జాతీయ భద్రతా ఏజెన్సీ సైబర్ ఆయుధాల పైరసీ పత్రాల్లో వెల్లడైంది. తాజా దాడి ఆ విధంగానే జరిగినట్లు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ పన్ను అకౌంటింగ్ ప్యాకేజీ ‘మిడాక్’ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సిస్టంల వల్లే వైరస్ విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
దిద్దుబాటు చర్యలకు...
దాడి ప్రభావాన్ని తగ్గించేందుకు జేఎన్‌పీటీ దిద్దుబాటు చర్యలకు దిగింది. జీటీఐ టర్మినల్‌లో కార్యకలాపాలు నెమ్మదించాయని, కాబట్టి ఆపరేషన్లను తాత్కాలికంగా మిగతా రెండు టర్మినళ్ల గుండా కొనసాగించాలని నిర్వహణ సంస్థ ఏపీఎంను కోరినట్లు అధికారి ఒకరు తెలిపారు. జీటీఐ టర్మినల్‌లో తలెత్తిన అంతరాయాలను పరిష్కరించడానికి, రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా నౌకరవాణా శాఖ, జేఎన్‌పీటీ చర్యలు తీసుకుంటున్నాయని కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జేఎన్‌పీటీ పోర్టులో సమస్య పరిష్కారానికి జాతీయ సైబర్ జాతీయ భద్రతా సలహాదారుడు గుల్షాన్ రాయ్‌ను కేంద్రం హుటాహుటిన ముంబై పంపింది. సైబర్ దాడులు తమ దేశంలోఆగిపోయాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. చౌర్యానికి గురైన సమాచారాన్ని తిరిగి పొందడానికి సైబర్ నిపుణులు కృషిచేస్తున్నారని తెలిపింది.
డబ్బులిస్తేనే...సమాచారం తిరిగిస్తామంటూ హ్యాకర్ల బేరసారాలు
కీవ్: ‘వాన్నాక్రై’ రాన్‌సమ్‌వేర్ తరువాత ప్రపంచం మరో సైబర్ ముప్పును ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ లక్ష్యంగా ‘పెట్యా’ పేరుతో ప్రారంభమైన వైరస్ ఆ దేశంలో పలు ప్రైవేట్, ప్రభుత్వ బ్యాం కింగ్, ఇతర కంపెనీలపై ప్రభావం చూపిం ది. ఆ తరువాత క్రమంగా బ్రిటన్, యూరప్‌లోని ఇతర దేశాలతో పాటు, భారత్‌లోకి ప్రవేశించింది. ‘పెట్యా’ మాల్‌వేర్ అత్యంత శక్తిమంతమైనదని, నెట్‌వర్క్‌లోని ఒక సిస్టంలోకి ప్రవేశించిన తరువాత అత్యంత వేగంగా ఇతర సిస్టంలలోకి వ్యాపిస్తుందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరించా రు.
పలు టెక్నిక్‌లతో ఆటోమేటిక్‌గా వ్యాప్తిచెందుతుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమని తెలిపా రు. మరోవైపు, యూరప్ నుంచి భారత్‌లోకి అడుగుపెట్టిన పెట్యా ప్రభావం భారత్‌లో అంతంత మాత్రమే అని సాంకేతిక, సమాచార మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచంలోని 150 దేశాలపై సైబ ర్ దాడి ప్రభావం పడినట్లు సమాచారం. ముంబైలోని ‘జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్(జేఎస్‌పీటీ)’ కూడా ఈ వైరస్ ప్రభావానికి లోనైంది.
పెట్యా అంటే..?
రష్యన్ భాషలో ‘పెట్యా’ అంటే రాయి అని అర్థం. వాస్తవానికి వైరస్ దాడి జరిగిన కొద్ది గంటల తర్వాత నిపుణులు గతంలో దాడిచేసిన రాన్సమ్‌వేర్‌కు తాజా వైరస్‌కు కొద్దిపాటి పోలిక మాత్రమే ఉందని పేర్కొన్నారు. రాన్సమ్‌వేర్... మన కంప్యూటర్‌ను ఆధీనంలోకి తీసుకుని మనల్ని పని చేయకుండా నిరోధించడంతో పాటు.. డబ్బు డిమాండ్ చేస్తుంది. తాజా ‘పెట్యా’ దాడి నుంచి విముక్తి లభించాలంటే 300 డాలర్లు క్రిప్టో కరెన్సీ (బిట్ కాయిన్) రూపంలో చెల్లించాలంటూ హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
వ్యాపార సంస్థలపైనే గురి...
తాజా సైబర్‌దాడికి యూరప్ దేశాల్లోని పెద్దపెద్ద సంస్థలు, బ్యాంకులు విలవిల్లాడిపోయాయి. దీని కారణంగా విద్యుత్తు వ్యవస్థ సైతం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఉక్రెయిన్ ప్రభుత్వ విభాగా లు, విద్యుత్తు సరఫరా సంస్థలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థలు, నౌకాయాన సంస్థలు, చమురు, సహజవాయు సంస్థలు, ఆహార సరఫరా సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పరిహారం డిమాండ్ చేస్తూ వచ్చిన హ్యాకర్ల సంక్షిప్త సందేశాలకు బదులుగా ఎన్ని సందేశాలు పంపినా తిరిగి సమాధానాలు రాలేదు.
ముందు జాగ్రత్తలు
కంప్యూటర్లు ఈ వైరస్ బారినపడినట్లు గుర్తిస్తే వెంటనే ఇంటర్నెట్ తొలగించాలి.
బయాస్ క్లాక్‌ని సవరించడంతో కొంత వరకు వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు.
అనుమానాస్పద మెయిల్స్‌ను తెరిచినా అటాచ్‌మెంట్‌లను క్లిక్ చేయొద్దు.
కంప్యూటర్‌లోని ముఖ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోవాలి.