వచ్చే ఏడాది ‘ఫండ్’నున్న పరిశ్రమ | next year mutual fund will be good in industry | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది ‘ఫండ్’నున్న పరిశ్రమ

Published Wed, Dec 25 2013 1:33 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

వచ్చే ఏడాది ‘ఫండ్’నున్న  పరిశ్రమ - Sakshi

వచ్చే ఏడాది ‘ఫండ్’నున్న పరిశ్రమ

 ముంబై: వచ్చే ఏడాది మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) దేబాశిష్ మల్లిక్ చెప్పారు. అమెరికా, యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక రికవరీ వృద్ధి బాట పట్టడం, ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావం దీనికి కారణమని వివరించారు. అమెరికా, యూరప్, జపాన్ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న సూచనలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయని, ఫలితంగా ఈ దేశాల కంపెనీలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే డెట్ పథకాల్లో నిధుల ప్రవాహం పెరుగుతుందని వివరించారు. ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు  విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు)లలో పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మన దేశ వృద్ధి అవకాశాలు జోరుగా ఉంటాయని వివరించారు.
 
 మార్కెట్లు బాగుంటాయ్...
 ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అంచనాలు బాగా ఉన్నాయని, దీంతో మార్కెట్లు బావుంటాయని, మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు జోరందుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.7.01 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి రూ.8.9 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు దూరమయ్యారని  పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోళ్లను 1,000 కోట్ల డాలర్లు తగ్గించాలన్న నిర్ణయం  ప్రభావం స్వల్పమేనని ఆయన తేల్చారు. జూలైతో పోల్చితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కరంట్ అకౌంట్‌లోటు కూడా మెరుగైన పరిస్థితిలోనే ఉందని, అందుకే ఫెడ్ నిర్ణయం ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని  దేబాశిష్ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement