లాలు తనయులకు అగ్రతాంబూలం!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహా కూటమి నూతన మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది. మహాకూటమిలో భాగంగా ఉన్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ బెర్తుల కేటాయింపులపై మంతనాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 20న ఛాత్ పూజ నిర్వహించిన అనంతరం నితీశ్కుమార్ నేతృత్వంలో నూతన మంత్రిమండలి ప్రమాణం స్వీకరించనుందని తెలుస్తున్నది.
బిహార్ క్యాబినెట్లో 35మందికి అవకాశం లభించనుందని, ఇందులో ఆర్జేడీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురికి మంత్రి పదవి లభించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఊహించినట్టే ఎమ్మెల్యేలుగా గెలిచిన లాలు తనయులు తేజ్ ప్రతాప్, తేజస్వికి క్యాబినెట్ హోదాతో కూడిన మంత్రి పదవులు లభించనున్నాయి. అదేవిధంగా ఆర్జేడీ ఎమ్మెల్యేలైన అబ్దుల్ బారి సిదిఖీ, లలిత్ యాదవ్, అలోక్ మెహతా, విజయ్ కుమార్ లకు కూడా మంత్రి పదవులు లభించే అవకాశముందని ఆ వర్గాలు చెప్పాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ లో 80 స్థానాలు ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే.