తమది చిన్నపార్టీ అని ఒప్పుకున్న సీఎం
పట్నా: తాను ప్రధానమంత్రి పదవికి పోటీలో లేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. తానో చిన్న పార్టీకి చెందిన నాయకుడినని, తనకు జాతీయస్థాయిలో ఆశలు లేవని చెప్పారు. బిహార్ ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టి సారించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మోదీకి సమర్థ నాయకుడని నమ్మి దేశ ప్రజలకు ఆయనకు ఎన్నుకున్నారని, తనకు అంత సామర్థ్యం లేదని అన్నారు.
‘శరద్ యాదవ్ వరుసగా మూడుసార్లు జేడీ(యూ) అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఈ పదవిని నాకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు నిర్ణయించారు. దీనికి మీడియా పెడర్థాలు తీస్తోంది. నేను జాతీయస్థాయి పదవులపై కన్నేసినట్టు ప్రచారం చేస్తోంది. జేడీ(యూ) అధ్యక్షుడిగా మా పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాను. దీనర్థం నేను ప్రధాని పదవి కోసం కలలు కంటున్నానని కాద’ని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ఆచితూచి స్పందించారు. దీనిపై లాలునే అడగాలని, ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు.