తెలంగాణ బిల్లుపై చర్చ జరుగకుండానే రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ జరుగకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణ బిల్లు ఈ రోజు చర్చకు రావడంలేదని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ చెప్పారు. బిల్లుపై ఈ రోజు చర్చకు అనుమతించడంలేదని ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ముగ్గురు సీమాంధ్ర సభ్యులు వెల్ వద్ద ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు.
లోక్సభలో నిన్న ఆమోదం పొందిన విభజన బిల్లుపై రాజ్యసభలో ఈ రోజు చర్చ జరపాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రతులను రాజ్యసభ సభ్యులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నం సభలో విభజన బిల్లుపై చర్చ జరుగుతుందని భావించారు. చర్చకు రెండు గంటల సమయం కూడా కేటాయించారు. సభ పలుమార్లు వాయిదాలు పడుతూ ఇతర బిల్లులను ఆమోదించారు. తెలంగాణ బిల్లు మాత్రం చర్చకు రాకుండానే డిప్యూటీ చైర్మన్ రేపటికి వాయిదా వేశారు.