కోరుకున్న లక్ష్యం దిశగా విరాట్ కోహ్లి!
డిసెంబర్ 2009లో టీమిండియా తొలిసారి టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. కొద్దికాలమే ఆ ర్యాంకు భారత్ నిలబెట్టుకుంది. ఇప్పుడు కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో మన కుర్రాళ్లు బాగా ఆడుతుండటంతో టెస్టు క్రికెట్‌లో మళ్లీ ఆ కిరీటం టీమిండియాను ఊరిస్తోంది. నంబర్ ర్యాంకును దృష్టిలో పెట్టుకొని వెస్టిండీస్ జట్టుతో నాలుగో టెస్టుకు జట్టు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ట్రినిడాడ్‌లో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులోనూ విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది.
ఇదే విషయాన్ని టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. 'టీమిండియా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆడుతోంది. నంబర్ ర్యాంకును సాధించడంపైనే మేం దృష్టి పెట్టాం. అదెంతో దూరంలో లేదు' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి పగ్గాలు టెస్టు కెప్టెన్ పగ్గాలు తీసుకున్నప్పుడు.. టీమిండియాను నంబర్ వన్‌గా నిలబెట్టాలని కోహ్లి భావించాడని, ఆ లక్ష్యం దిశగానే జట్టును విజయాలపథంలో నడిస్తున్నాడని రోహిత్ కొనియాడాడు.
ప్రస్తుతం 112 పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండోస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కన్నా ఆరుపాయింట్లు వెనుకబడి ఉంది. అయితే, శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో వెనుకబడటంతో ఆ జట్టు నంబర్ వన్ స్థానం నుంచి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే కచ్చితంగా నంబర్ ర్యాంకును సొంతం చేసుకుంటుందని పరిశీలకులు చెప్తున్నారు.