
బిచ్చగాళ్ల నోట ప్రభుత్వ పథకాల పాటలు!
'నడిపించు నా నావా..' 'బంతుకు బండి బైలెల్లినాదో..' అంటూ రైళ్లలో యాచకులు పాడే పాటలు ఇకముందు వినిపించవు..
న్యూఢిల్లీ: 'నడిపించు నా నావా..' 'బంతుకు బండి బైలెల్లినాదో..' అంటూ రైళ్లలో తమ పాటల ద్వారా తత్వాన్ని బోధిస్తూ పదో పరకో అడుక్కునే యాచకులకు సరికొత్త శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. వారు ప్రస్తుతం ఆలపిస్తున్న పాటల్ని సమూలంగా మాన్పించి.. వాటి స్థానంలో ప్రభుత్వ పథకాలను పాటలుగా పాడించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 5 వేల మంది యాచకుల ఎంపిక కూడా పూర్తయినట్లు తెలిసింది.
మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో.. బేటీ పడావో, జన్ధన్ యోజన తదితర పథకాలకు ఇప్పటికే రేడియో, టీవీ, సామాజిక మాధ్యమాల్లో కల్పిస్తున్న ప్రచారం సరిపోవడంలేదంటూ వినూత్న ప్రయోగానికి తెరలేపిన కేంద్రం.. ఆయా పథకాలకు సంబంధించిన పాటలకు యాచకులు ప్రచారం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే గుర్తించిన 5 వేల మంది యాచకులకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అతి తర్వరలోనే మనం ఈ పాటలు వినే అవకాశం ఉంది.