ఆ నిరసనలతో ఆడియెన్స్ పెరిగారు!
న్యూఢిల్లీ: టీవీ నటుడు గజేంద్రసింగ్ చౌహాన్ గుర్తుఉన్నారు కదా! పుణెలోని ప్రతిష్ఠాత్మక ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఆయనను ప్రకటించింది మొదలు నిరసనలు, ధర్నాలు హోరెత్తాయి. విద్యార్థులు పెద్దసంఖ్యలో తరగతులు బహిష్కరించి.. ధర్నాలు చేశారు. ఆయన నియామకంపై దేశవ్యాప్తంగా టీవీల్లో చర్చలు కూడా జరిగాయి. ఈ వివాదం ఆయనను బాగానే వెలుగులోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది. ఢిల్లీలో ఆయన శివుడి పాత్ర వేస్తున్న నాటకానికి ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.
దసరా సందర్భంగా ఎర్రకోట సమీపంలో రామ్లీలా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో గజేంద్రసింగ్ చౌహాన్ శివుడుగా నటిస్తున్నారు. ఆయన పార్వతీదేవికి రాముడి ఇతివృత్తాన్ని వివరిస్తారు. ఈ నాటకంలో ఆయన పాత్రను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. "35 ఏండ్ల కెరీర్లో చాలా డైలాగులను నేను గుర్తుంచుకున్నాను. కానీ తొలిసారి రంగస్థలం మీద నటిస్తున్నాను. ఇక్కడ ప్రత్యక్షంగా నటించడం మినహా ఎలాంటి రీటేక్ లకు అవకాశం ఉండదు' అని గజేంద్ర చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన "మహాభారత్' సీరియల్లో ధర్మరాజు పాత్ర పోషించి టీవీ ప్రేక్షకులను అలరించారు.