న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా ప్రపంచం ముందడుగు వేస్తున్న నేపథ్యంలో భారతీయ నౌకాదళం కొత్త చర్యలకు ఉపక్రమించింది. అత్యాధునిక సాంకేతిక కలిగిన యుద్ధ నౌకలు, ఆయుధాలు, సెన్సార్లను విధి నిర్వహణలో వినియోగించాల్సివుండటంతో అందుకు తగిన వారిని కొలువులకు ఎంపిక చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు తొలుత బీ.టెక్ పట్టభద్రులను ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొనడం వెనుక ఆంతర్యం ఇదే. తాజాగా 10+2 బీ.టెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ లో ప్రవేశాన్ని పొందాలంటే కచ్చితంగా జేఈఈ(మెయిన్స్)లో ర్యాంకు సాధించాలని పేర్కొంది. దీంతో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితాల్లో ఇంటర్ లో సాధించిన మార్కుల ఆధారంగా నేవీలో ప్రవేశం దుర్లభంగా మారింది.
ఎస్ఎస్ బీ ఇంటర్వూల ద్వారా ఉత్తమ అభ్యర్ధులను నేవీకి ఎంపిక చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. జేఈఈ రాంక్యుల వివరాలను నేవీకి అందించేందుకు సీబీఎస్ఈ ఒప్పుకున్నట్లు తెలిపారు. 2017 జేఈఈ(మెయిన్స్) నుంచి అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను మొదట ఎస్ఎస్ బీ ఇంటర్వూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.