సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు వేర్వేరుగా ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులకు మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురు, టీడీపీ సీమాంధ్ర ఎంపీలు నలుగురు... మొత్తం 13 మంది సోమవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాము ఈ అవిశ్వాసానికి మద్దతు తెలుపుతామని బిజూ జనతాదళ్ (బీజేడీ) మంగళవారం ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ జయ్‌పాండా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. బీజేడీకి లోక్‌సభలో 14 మంది సభ్యుల బలముంది.
అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తున్న శివసేన (11 మంది ఎంపీలు), ఏఐడీఎంకే (9)లు కూడా అవిశ్వాసంపై కలిసి వచ్చే అవకాశాలున్నాయి. అకాలీదళ్ (4) మద్దతు కూడా ఉన్నట్లు సమాచారం. అప్పుడు తీర్మానానికి మద్దతుగా నిలిచే వారి సంఖ్య 51కి చేరుతుంది. సభ సజావుగా సాగితే బుధవారం లోకసభలో తీర్మానం చర్చకు వస్తుంది. చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది. అవిశ్వాస నోటీసులు అందాయని, సభలో ప్రశాంతత నెలకొంటే తప్ప తాను వాటిని సభ ముందుకు తేలేనని స్పీకర్ మీరాకుమార్ మంగళవారం సభలో తెలిపారు.
ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు: సమాజ్‌వాదీ
అవిశ్వాసానికి మద్దతిచ్చే విషయంలో తమ పార్టీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఒకరు మంగళవారం రాత్రి పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. అవిశ్వాసం అనూహ్యంగా తెరపైకి వచ్చిందని, ఒకవేళ దీనిని ఓటింగ్ దాకా రానీయకుండా అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే... చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకం కాబట్టి అవిశ్వాసంపై తామొక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. తుది నిర్ణయాన్ని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు వదిలేసినట్లు తెలిపారు. కాగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఆర్టికల్-3పై వాయిదా తీర్మానాలు తెస్తే మద్దతిస్తామని, అవిశ్వాసానికి మాత్రం మద్దతివ్వలేమని స్పష్టం చేశారు.
అవిశ్వాసానికి పెరుగుతున్న మద్దతు
Published Wed, Dec 11 2013 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement