విశాఖ రూరల్, న్యూస్‌లైన్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ‘రాజధాని’ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. సీమాంధ్ర రాజధాని రేసులో ఇతర జిల్లాల కంటే అనేక సానుకూలాంశాలతో దూసుకుపోతోంది. రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే యూపీఏ కార్యాచరణను వేగవంతం చేసింది. ఈ నిర్ణయంపై ఒకవైపు సీమాంధ్ర రగిలిపోతుంటే.. మరోవైపు నూతనంగా ఏర్పర్చాల్సిన రాజధాని అంశంపై కేంద్రం దృష్టి సారించింది. సీమాంధ్రలో ఉన్న 13 జిల్లాల్లో ఏ నగరాన్ని దేన్ని రాజధాని చేయాలన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. కర్నూలు, ఒంగోలు, గుంటూరు, విజయవాడతోపాటు విశాఖ పేరును పరిశీలిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూముల లభ్యతపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. రాజధానికి అవసరమైన, అనువైన స్థలాలు, ఇతరత్రా మౌలిక వసతులపై నివేదికలు రూపొందించి పంపించాలంటూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్స్(సీసీఎల్‌ఏ) నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి రెవెన్యూ డివిజినల్ అధికారులతో కూడా సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిసింది. ప్రస్తుతం సమైక్యాంధ్ర కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతుండడంతో అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
విశాఖకు అనేక సానుకూలాంశాలు
రాష్ట్ర విభజన తప్పనిసరైతే సీమాంధ్ర రాజధానిగా విశాఖకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. రోడ్డు, జల, వాయు మార్గాలకు అనువైన ప్రాంతంగా రాష్ట్రంలోనే విశాఖ గుర్తింపు పొందడంతో రాజధాని రేసులో నిలిచింది. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి దిశగా పయనిస్తుండడంతో విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వ్యయం కూడా తక్కువగా అవుతందన్న విషయాన్ని యూపీఏ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ పర్యాటక పటంలో విశాఖ స్థానాన్ని సంపాధించుకుంది. పారిశ్రామిక రాజధానిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయంతో పాటు ఓడరేవు, స్టీల్‌ప్లాంట్, పోర్టు, హెచ్‌పీసీఎల్, డాక్‌యార్డ్, షిప్‌యార్డ్, ఎన్‌ఎస్‌టీఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ పరిశ్రమలున్నాయి. హైదరాబాద్ తరువాత అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉంది.
రాజధాని పరిశీలనలో కర్నూలు, ఒంగోలు, గుంటూరు, విజయవాడలు కూడా ఉన్నా కొన్ని అంశాలు వాటికి అడ్డంకిగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒంగోలులో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నప్పటికీ అక్కడ మంచినీరు, ఫ్లోరైడ్ సమస్యలున్నాయి. గుంటూరును అనుకుంటే అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవకాశాలు చాలా తక్కువ. పక్కనే విజయవాడ గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో గుంటూరులో విమానాశ్రయం వచ్చే అవకాశాలు లేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఉన్నప్పటికీ దానిని విస్తరించే అవకాశాలు లేకపోవడం పెద్ద లోటుగా చెబుతున్నారు.
ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నా.. విశాఖపట్నానికి రాజధానిగా అన్ని అర్హతలున్నాయన్న వాదనలు ఊపందుకుంటున్నాయి. అయితే విశాఖను రాజధానిగా చేయాలన్న విషయంపై సీమ, గోదావరి జిల్లాల నాయకుల స్థాయిలో లాబియింగ్ చేసే వారు జిల్లాలో లేకపోవడం కొంత ప్రతికూలమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
20 వేల ఎకరాల గుర్తింపు
సీఎల్‌ఏ నుంచి ఆదేశాలు రాగానే అధికారులు ప్రభుత్వ భూములతో పాటు అసైన్స్ ల్యాండ్స్‌పై కూడా దృష్టి సారించారు. కేవలం రెవెన్యూకు సంబంధించినవే గాక ఏపీఐఐసీ, దేవాదాయ, అటవీ, తదితర శాఖల భూముల వివరాలను సేకరిస్తున్నారు. బంజరు, పోరంబోకు స్థలాలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలిస్తున్నారు. ప్రధానంగా విశాఖలో పెట్రో కెమికల్ పెట్రోలియం ఇండస్ట్రియల్ రీజియన్(పీసీపీఐఆర్)కే కేటాయించిన స్థలాలను అధికారులు గుర్తించారు. అదే విధంగా నాలుగేసి మండలాల చొప్పున రెండు బ్లాకులుగా తయారు చేసి భూములను లెక్కిస్తున్నారు. అచ్యుతాపురం, ఎస్.రాయవరం, రాంబిల్లి, యలమంచిలి మండలాలను ఒక బ్లాకుగాను, అలాగే సబ్బవరం, చీడికాడ, చోడవరం, కె.కోటపాడులను మరో బ్లాకుగా చేసి ఇప్పటి వరకు మొత్తం 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆనందపురం మండలంలో కూడా అధికంగానే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ కూడా సర్వే చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. అసైన్డ్ భూములతోపాటు అవసరమైతే ఆయా మండలాల్లో భూముల సేకరణకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంతలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె బాట పట్టాయి. దీంతో ప్రభుత్వ భూముల గుర్తింపు కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది.
రాజధాని రేసులో విశాఖ
Published Wed, Aug 14 2013 4:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement