
పోలింగ్ బూత్‌లో క్రికెటర్‌తో సెల్ఫీ.. దుమారం
జలంధర్: ఓటేసేందుకు వచ్చిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో ఎన్నికల అధికారులు, సిబ్బంది సెల్ఫీలు దిగడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్, గోవా రాష్ట్రాల్లో శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. క్రికెటర్ హర్భజన్ తన తల్లి అవతార్ కౌర్, కుటుంబసభ్యులతో కలిసి జలంధర్ నగరంలోని 23వ నంబర్ పోలింగ్ బూత్‌కు ఓటేయడానికి వచ్చాడు. అందరిలాగే క్యూ లైన్లో నడుస్తూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన భజ్జీని చూసి ఎన్నికల అధికారులు ఒకింత ఉత్సాహానికి లోనయ్యారు. భజ్జీతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ దృశ్యాలుకాస్తా మీడియాలో ప్రసారం కావడంతో సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓటువేసిన అనంతరం హర్భజన్ మీడియాతో మాట్లాడాడు. ‘ఇంతకముందు రాష్ట్రంలో రెండే రెండు కూటములు(కాంగ్రెస్, అకాలీ-బీజేపీ) తలపడేవి. ఇప్పుడు బరిలోకి మూడో పార్టీ(ఆప్)కూడా నిలిచింది. దీంతో ఓట్లు భారీగా చీలిపోతాయని అనుకుంటున్నా. ఈ పోరులో ఎవరు గెలిచినా, వారు తమ పార్టీకి కాకుండా పంజాబ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని హర్భజన్ అన్నాడు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో(నేడు) పోలింగ్ జరుగుతున్నది. మార్చి 11న ఫలితాలు వెలువడతాయి.