వారి తీరును టీవీల్లో చూపండి!
విపక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు
* లోక్‌సభను అడ్డుకుంటున్న సభ్యులపై స్పీకర్ కన్నెర్ర
న్యూఢిల్లీ: నిరసనలు, నినాదాలు, ప్లకార్డులతో సభలో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న విపక్ష సభ్యులపై మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మండిపడ్డారు. వారి వైఖరి ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్నారు.నిరసనలకు పాల్పడుతున్న 40, 50 మంది ప్రతిపక్ష సభ్యులు సభలోని 440 మంది ఇతర సభ్యుల హక్కులను హైజాక్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, స్పీకర్ పోడియం వద్ద కెమెరాలకు కనిపించేలా వరకు ప్లకార్డులను ఎత్తి పట్టుకోవడంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. నేను సభను వాయిదా వేయను. లోక్‌సభ టీవీని కోరుతున్నా. టీవీలో కనిపించాలన్న కోరిక నాకు లేదు. టీవీల్లో వారిని కనిపించనివ్వండి. సభలో వారి తీరు ఎలా ఉందో ప్రజలను చూడనివ్వండి. వారి బాధ్యతారాహిత్యాన్ని దేశమంతా చూడాలి’ అంటూ నిప్పులు చెరిగారు. విపక్ష సభ్యుల తీరుపై అంతకుముందు మంత్రి వెంకయ్య నాయుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సభను కేవలం 20 మంది సభ్యులు తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలనుకుంటున్నారా?’ అంటూ మండిపడ్డారు.
యథావిధిగా.. లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగమంత్రి సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లు రాజీనామా చేయాలనే డిమాండ్‌తో విపక్షాలు కార్యక్రమాలను మంగళవారమూ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లో నిరసన తెలిపారు. తమ వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో వారు నిరసనలను తీవ్రం చేశారు.
డిప్యూటీ స్పీకర్ తంబిదురై సభాపతి స్థానంలో ఉన్న సమయంలో.. వారు తమ చేతిలోని కాగితాలను చింపి, ఆయనపై విసిరారు. దాంతో తొలుత రెండు సార్లు వాయిదా పడిన సభ, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బుధవారానికి వాయిదా పడింది. కాగితాలు విసరడం క్షమార్హం కాదని సుమిత్ర మండిపడ్డారు.