
జాధవ్ ఆ ‘కీలక’ సమాచారాన్ని చెప్పాడు: పాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్ విషయంలో కొత్త వాదనను దాయాది తెరపైకి తెచ్చింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక నిఘా సమాచారాన్ని జాధవ్‌తో తమతో పంచుకున్నాడని చెప్పుకొచ్చింది. ‘ పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని జాధవ్ మాతో పంచుకుంటున్నాడు’ అని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే, జాధవ్ ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టాడనే విషయాన్ని ఆయన తెలుపలేదు. గూఢచర్యం ఆరోపణలపై జాధవ్‌కు పాక్ ఆర్మీ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఏకపక్షంగా శిక్ష విధించడాన్ని తప్పుబడుతూ ఆయన ఉరిశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది.