పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మృతి చెందిన సభ్యులు, మాజీ సభ్యులకు సంతాపం తెలిపిన అనంతరం ఉభయ సభలు తొలిరోజు వాయిదా పడ్డాయి. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా నియోజకవర్గానికి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మురళీలాల్ సింగ్ (61) బుధవారం రాయ్‌పూర్‌లో మృతి చెందడంతో ఆయనకు లోక్‌సభ నివాళులర్పించింది. ఆయన గిరిజనుల కోసం అహరహం శ్రమించారని స్పీకర్ మీరా కుమార్ కొనియాడారు. మాజీ సభ్యులు గుర్వీందర్ కౌర్ బ్రార్, ఆర్‌పీ సారంగి, మోహన్‌సింగ్, రామ్ నరేశ్ కుష్వాహ, మోహన్ ధారియా, నితీశ్ సేన్‌గుప్తా, హెచ్‌పీ సింగ్‌ల మృతికి లోక్‌సభ సంతాపం తెలిపింది.
అంతేగాక, కెన్యా రాజధాని నైరోబీలోని మాల్ జరిగిన కాల్పుల్లో మృతి చెందిన నలుగురు భారతీయులకు, రెండు నెలల క్రితం ముంబైలో భవంతి కూలిన సంఘటనలో 27 మంది మృతికి, పైలీన్, హెలెన్, ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించిన హైయాన్ తుపానులు, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, ఒడిశా వరదల్లో మృతి చెందిన వారికి, మధ్యప్రదేశ్ రతన్‌గఢ్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 111 మందికి, ఔరంగాబాద్ పేలుళ్లలో తుదిశ్వాస విడిచిన ఏడుగురు పోలీసులకు లోక్‌సభ నివాళి అర్పించింది. వీరందరికి రాజ్యసభ సభ్యులు కూడా సంతాపం తెలిపారు. అంతేగాక గాయకుడు మన్నా డే మృతికి, ఆంధ్రప్రదేశ్ వోల్వో బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు.