ఉద్యోగ సంఘాలతో పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) చర్చలను గురువారం ముగించింది. ఉద్యోగ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలు, డిమాండ్ల మీద రెండు నెలలకుపైగా ఒక్కో సంఘంతో పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్ వేర్వేరుగా చర్చలు జరిపారు.
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) చర్చలను గురువారం ముగించింది. ఉద్యోగ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలు, డిమాండ్ల మీద రెండు నెలలకుపైగా ఒక్కో సంఘంతో పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్ వేర్వేరుగా చర్చలు జరిపారు. వేతన సవరణ సిఫార్సుల నిర్ధారణలో ఉద్యోగ సంఘాలతో చర్చలది ముఖ్యపాత్ర. చర్చల ప్రక్రియ ముగింపుతో పీఆర్సీ పనిలో ముఖ్యమైన ఘట్టం పూర్తయింది. ఇక నివేదిక రూపకల్పన మీద పీఆర్సీ కసరత్తు ప్రారంభించనుంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో.. నివేదికను త్వరగా తెప్పించుకొని కొత్త పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. డిసెంబర్ రెండో వారానికి నివేదిక తయారు చేయడం వీలవుతుందని, ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటే త్వరలోనే ప్రభుత్వానికి అందే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. నివేదిక సమర్పించడానికి మార్చి రెండోవారం వరకు పీఆర్సీకి గడువు ఉంది.
త్వరలో ఐఆర్..?: పీఆర్సీ అమలు కంటే ముందు మధ్యంతర భృతి(ఐఆర్) కోసం పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రచ్చబండ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. 50 శాతం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 25-35 శాతం మధ్య నిర్ణయమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. సంతృప్తికర స్థాయిలో ఐఆర్ ప్రకటిస్తే, పీఆర్సీ అమల్లో మెరుగైన ఫిట్‌మెంట్ సాధించడానికి అవకాశం ఉంటుంది.
75% ఫిట్‌మెంట్‌తో చెల్లించాలి: సచివాలయ ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులకు 75 శాతం ఫిట్‌మెంట్‌తో వేతనాలు చెల్లించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 63 శాతం డీఏ చెల్లించాలని పీఆర్సీని కోరారు. సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు గురువారం పీఆర్సీ చైర్మన్‌ను కలిసి తమ ప్రతిపాదనలపై వివర ణ ఇచ్చారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ. 16 వేలుగా నిర్ధారించాలని పీఆర్సీని కోరినట్టు సమాఖ్య నేతలు మురళీకృష్ణ, నరేందర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో 5 రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పొడిగించాలని, నగర ఉద్యోగులకు సిటీ అలవెన్స్‌ను రూ. 6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ రూ. 25 లక్షల గృహ రుణాలు అందజేయాలన్నారు. వచ్చేనెల 15వ తేదీలోగా పీఆర్సీని అమల్లోకి తేవాలని, 45శాతం మధ్యంతర భృతి చెల్లించాలని విన్నవించారు.
కనీస పెన్షన్ రూ. 15 వేలు చెల్లించాలి: పెన్షనర్ల సంఘం
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 15 వేలు చెల్లించాలని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ పీఆర్సీకి నివేదించింది. కనీస వేతనంతో సమానంగా పెన్షన్ చెల్లించాలని కోరింది. ఉద్యోగి రిటైర్డ్ అయితే రూ. 15 లక్షల గ్రాట్యుటీ చెల్లించాలని అసోషియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్ రెడ్డి గురువారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ పి.కె. అగర్వాల్‌ను కలిసి విన్నవించారు.