కార్డు స్వైప్ లేకుండానే చెల్లింపులు!
కార్డు స్వైప్ లేకుండానే చెల్లింపులు!
Published Wed, Nov 23 2016 8:00 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM
రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో పేటీఎం వంటి డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారుల కోసం పేటీఎం తన యాప్ను అప్డేట్ చేసింది. స్వైప్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లతోనే ఇన్నిరోజులు జరిగిన దుకాణాల లావాదేవీలు ఇక నుంచి తమ పేటీఎం యాప్ ద్వారా కూడా చేసేవిధంగా వీలు కల్పించింది. ఈ మిషన్ల అవసరం లేకుండా తమ లేటెస్ట్ పేటీఎం యాప్ వెర్షన్తో దుకాణదారులు కార్డు పేమెంట్లను అంగీకరించవచ్చని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్లోని తాజా అప్డేట్ చిన్న వర్తకులకు ఎంతో సహకరిస్తుందన్నారు.
యూజర్ల దగ్గర పేటీఎం అకౌంట్ లేనిసమయంలో, దుకాణదారులు వారివద్ద నున్న పేటీఎం యాప్ ద్వారా బిల్లును జనరేట్ చేయడానికి మీ కార్డు వివరాలు, ఫోన్ నంబర్ నమోదు చేయనున్నారు. ఆ సమయంలో యూజర్ల మొబైల్కు ఓ ఓటీపీ(ఒన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దుకాణ దారుడి ఫోన్లో ఆ ఓటీపీ నమోదుచేయగానే, తమ బిల్లు చెల్లింపు జరిగిపోతోంది. తాజా అప్‌డేట్ ద్వారా చిన్న దుకాణాదారులకు.. ఇటు చిల్లర దొరక్క ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మేలు జరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం భారత్లో కేవలం 14 లక్షల మెషిన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. స్మార్ట్ఫోన్ ఉంటే, దేనినైనా మార్చే విధంగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రోజుకు 70 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని తెలిపారు. దీంతో తాము 5 బిలియన్ డాలర్ల విలువైన జీఎంవీ అమ్మకాల లక్ష్యాన్ని నాలుగు నెలల ముందే సాధించామని ఆనందం వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దు హఠాత్తు నిర్ణయంపై ప్రతిపక్షం కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంపెనీకి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్లను ఆయన తోసిపుచ్చారు. ఇదంతా అనవసర రాద్ధాంతమని, ఈ కష్టం భవివ్యత్తులో భారీ మొత్తంలో లబ్దిచేకూరుస్తుందని శర్మ చెప్పారు.
Advertisement
Advertisement