నీ దారే నా దారి ...
ఇద్దరూ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు. హస్తినలో పార్టీ అధిష్టానం పెద్దల వద్ద మంచి పలుకుబడితోపాటు అత్యంత నమ్మకస్తులుగా పేరు సంపాదించారు. అంతే కాకుండా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో ఆ ఇద్దరు నేతలు... అధిష్టానం తలలో నాలుకగా వ్యవహారించారు. దీంతో వారిద్దరికి కొంచెం అటు ఇటుగా పీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టింది.
పార్టీ అధిష్టానం వారి సేవలను గుర్తించి... పెద్ద పదవుల్లో కూర్చొబెట్టినా.. వారు వన్ మోర్ ఛాన్స్ అనటంతో... ఒక్క ఛాన్స్ ఇచ్చాం కదా అంటూ అధిష్టానం ససేమిరా అంది. దాంతో వారిద్దరూ హస్తానికి రాం రాం అని.... ఒకరు తర్వాత ఒకరు కొన్నేళ్ల తేడాతో అధిష్టానం పెద్దలకు 'చెయ్యి' చూపించి మరీ 'కారు' ఎక్కేశారు. వారిలో ఒకరు కారు ఎక్కిన మరుక్షణమే పెద్దల సభలో సీటు కొట్టేశారు. మరొకరు ఎమ్మెల్సీ లేదా పెద్దల సభలో సీటు ఏదైనా ఫర్వాలేదు మీరు ఇక్కడంటే ఇక్కడ... అక్కడంటే అక్కడ.. ఎక్కడైనా సరే అంటూ కర్చీఫ్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నారు.
వారిలో ఒకరు కె. కేశవరావు కాగా మరొకరు డీ శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లిన కేశవరావు పదవి కాలం ముగియడంతో మరోసారి పదవి దక్కలేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ పార్టీ తరపున పెద్దల సభలో సీటు సంపాదించేశారు. డీఎస్ కూడా అదే రీతిలో ఎమ్మెల్సీ పదవి అనుభవించి... మరో సారి ఆ పదవి ఇవ్వమని అధిష్టానం పెద్దలను కోరారు. అందుకు వారు 'నో' అనకుండా ఆయన శిష్యురాలు అకుల లలితకు ఆ పదవిని కట్టబెట్టారు.
దాంతో ఆయన హస్తం వీడి కారు ఎక్కేశారు. ఒకరు తర్వాత ఒకరు పీసీసీ మాజీ చీఫ్లు ఎంచెక్కా గులాబీ కారు ఎక్కేశారు. చూడబోతే నీ దారే నా దారంటూ ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రస్తుత టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావును మరో సీనియర్ నేత డీఎస్ ఫోలో అయినట్లు లేదు.