న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతోపాటు ఓటరు ధ్రువీకరణ రశీదు కోసం సంబంధిత పరికరాలను కొనుగోలు చేయడానికి కేంద్రం నుంచి అందుకున్న మొత్తం నిధుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు.. భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)ను ఆదేశించింది. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) వేసిన పిటిషన్ వాదనల సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్, అబ్దుల్‌నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు ఎన్నికలలో ఉపయోగించడానికి ఓటరు ధ్రువీకరణ రశీదు(ఓటర్ వెరిఫబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్– వీవీపీఏటీ) సంబంధిత పరికరాల కొనుగోలుకు రూ. 3,174 కోట్లతో ప్రతిపాదనలను ఈసీఐ కేంద్రానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ గతనెలలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
పలు పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయవాది చిదంబరం వాదనలు వినిపిస్తూ.. ‘‘త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఎప్పుడు భారత ఎన్నికల సంఘం వీవీపీఏటీ పరికరాలను ఉపయోగిస్తుందో, కేంద్రం నుంచి ఎన్ని నిధులు అందుకున్నారో వివరాలు ఇవ్వమనండి’’ అని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై జూలై మూడో వారంలో వాదనలు వింటామని, అంతలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంటూ ధర్మాసనం కేసును విచారణ వాయిదా వేసింది.
వీవీపీఏటీ నిధుల వివరాలు తెలపండి
Published Tue, May 9 2017 1:10 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement