
సుష్మాకు రెస్ట్.. వసుంధరకు విదేశాంగం?
- ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు ముగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో భారీ స్థాయిలోనే మార్పులు జరుగుతాయని తెలిసింది. ఇటీవలే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న సుష్మా స్వరాజ్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారని, ఆమె స్థానంలో విదేశాంగ మంత్రిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు అవకాశం కల్పిస్తారని ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఏప్రిల్ 12తో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాతిరోజే కేబినెట్ విస్తరణ జరుగుతుందని సమాచారం.
మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దరిమిలా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. కీలకమైన రక్షణ శాఖకు పూర్తిస్థాయి మంత్రి అవసరమైన నేపథ్యంలో.. వచ్చేవారం జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో దీనిపై వచ్చే అవకాశంఉంది. రక్షణ శాఖను అరుణ్ జైట్లీకి అప్పగించి, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ కేటాయిస్తారని తెలిసింది. ఇక యూపీ ముఖ్యమంత్రి పదివి బరిలో చివరిదాకా బరిలో నిలిచిన కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హాకు ప్రమోషన్ దక్కనున్నట్లు, ఆయనను పూర్తిస్థాయి కేబినెట్ మంత్రిగా నియమించనున్నట్లు సమాచారం. అయితే అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతేగానీ శాఖల కేటాయింపులపై స్పష్టతరాదు.