వర్షపు నీటిని సంరక్షించాలని, పచ్చదనానికి మొక్కలు నాటాలని, యోగాను ముందుకు తీసుకెళ్లాలని..
పచ్చదనానికి మొక్కలు నాటాలి: ‘మన్ కి బాత్’లో మోదీ
* బాలికా శిశువును పరిరక్షణను సామాజిక ఉద్యమంగా చేపట్టాలి
* ఆ ఫొటోలు పెట్టకపోతే బెలుం గుహలు దేశానికి తెలిసేది కాదేమో
సాక్షి, న్యూఢిల్లీ: వర్షపు నీటిని సంరక్షించాలని, పచ్చదనానికి మొక్కలు నాటాలని, యోగాను ముందుకు తీసుకెళ్లాలని.. అద్భుత భారత్‌కు మద్దతుగా పురావారసత్వ, పర్యాటక ప్రాంతాల విశిష్టతను చాటిచెప్పే ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
బాలికా శిశుసంరక్షణ కోసం సామూహిక ఉద్యమం చేపట్టాలన్నారు. రాఖీ పండగ సందర్భంగా అక్కచెల్లెలకు జనసురక్ష పథకాన్ని జీవితాంతం కానుకగా ఇవ్వాలన్నారు. రేడియో కార్యక్రమం ‘మన్ కి బాత్’లో భాగంగా ప్రధాని ఆదివారం 23 నిమిషాలు ప్రసంగించారు. మోదీ ‘మన్ కీ బాత్’ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
* పర్యాటక ప్రదేశాల ఫోటోలను ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’లో అప్‌లోడ్ చేసి ఉండకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లోని బెలుం గుహల విషయం దేశవాసులకు తెలిసేది కాదేమో.
* ప్రపంచ దేశాలను యోగా ఒక్కటిగా కలిపింది. యోగా ద్వారా సూర్యకిరణాలను స్వాగతించని దేశం లేదు. 21వ తేదీన జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం మనకు గర్వకారణంగా నిలిచింది. ఆన్‌లైన్ యోగా కార్యకలాపాల పథకాన్ని ప్రారంభించాలని, యోగా సంస్థలను ఒక వేదిక మీదకు తీసుకురావాలని కోరుతున్నా.
* రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు రూ. 12 నుంచి రూ. 330 వరకు కడుతూ జనసురక్ష పథకం జీవితాంతం కానుకగా ఇచ్చి సంకల్పాన్ని పూరించాలి.
* వర్షపు నీటిని సంరక్షిద్దాం. ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌లు వంటి వాటి ద్వారా నీటి సంరక్షణ, పచ్చదనం కోసం మొక్కలు నాటడం, వాటిని రక్షించడం ఒక ఉద్యమంలా కొనసాగాలి.
* దేశంలోని వంద జిల్లాల్లో స్త్రీ-పురుషుల నిష్పత్తి బాగా పడిపోతుండటం ఆందోళనకరం. హరియాణాలో సర్పంచ్ సునీల్ జగలాన్ తన కూతురితో సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో కల్పించిన ప్రచారం స్ఫూర్తిగా ఆ వూళ్లో ప్రతి ఒక్కరు కూతుళ్లతో సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పొందుపరుస్తున్నారు.