
నగరం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: గెయిల్ పైపులైను పేలుడు దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ, గెయిల్ నుంచి ఇచ్చే పరిహారానికి ఇది అదనమని పీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాల్సిందిగా పెట్రోలియంశాఖ మంత్రితోపాటు కేబినెట్ సెక్రెటరీ, గెయిల్ చైర్మన్‌లను ఆదేశించినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కి శుక్రవారం ఉదయం ఓ సందేశం పంపారు.
వెంటనే ప్రధానితో మాట్లాడా
గ్యాస్‌పైప్‌లైన్ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే షాక్‌కి గురైనట్టు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రికి వివరాలను చెప్పడంతోపాటు తక్షణం సహాయ చర్యలు తీసుకోవాలని కోరినట్టు వివరించారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరినట్లు తెలిపారు.
ప్రమాద సంఘటన తెలిసి తాను ఒక్కసారిగా నిర్ఘాంత పోయినట్టు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రమాదంలో పలువురు మృత్యువాత పడటంపై కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కూడా ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
పైపులైను పేలుడు దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహాయ పునరావాస చర్యల పర్యవేక్షణకు సీఎం చంద్రబాబు, పెట్రోలియం శాఖ కార్యదర్శి సౌరబ్‌చంద్ర, గెయిల్ ఛైర్మన్ బీసీ త్రిపాఠి, ఓఎన్‌జీసీ ఛైర్మన్ డి.కె.సర్రాఫ్‌లతో కలిసి ప్రత్యేక విమానంలో ఏపీ వెళ్లారు. అంతకుముందు కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గెయిల్ పైపులైను పేలుడు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ద్వారా విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.
పెట్రోలియం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈడీ, ఆయిల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ డెరైక్టరేట్ (ఓఐఎస్‌డీ) ఈడీలతో పాటు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ)సభ్యుడు నామినీగా ఉంటారని తెలిపారు. ఓఎన్జీసీ భద్రత కోసం రాజ్యాంగ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు.
పెట్రోలియం మంత్రిత్వశాఖ పరిధిలోని ఓఐఎస్‌డీ చమురు, గ్యాస్ సంస్థల భద్రతకు సంబంధించిన డిజైనింగ్, నిర్వహణ, మరమ్మతు వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ విభాగానికి రాజ్యాంగపరమైన ఎలాంటి అధికారాలు లేవని తెలుస్తోంది. అప్పటి పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి ఓఐఎస్‌డీకి రాజ్యాంగ అధికారాలు కల్పించాలని చేసిన ప్రతిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ విషయాన్ని ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లగా ఓఐఎస్‌డీకి రాజ్యాంగ అధికారాలు కల్పించే దిశగా పనిచేస్తుందని బదులిచ్చారు.