ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి: మోదీ
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నాయకుడు లక్ష్మణ్ రావ్ మాధవ్ రావ్ ఇనామ్ దార్ పై రాసిన పుస్తక విడుదల కార్యక్రమానికి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. గుజరాతీ భాషలో రచించిన ఈ పుస్తకాన్ని రాజాభాయ్ తో కలిసి మోదీ రచించారు. ఈ సందర్భంగా మోదీ పార్లమెంటు హౌస్ లో మాట్లాడారు. యువతలో రాజ్యంగానికి సంబంధించిన అవగాహనను పెంపొందించేందుకు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. రాజ్యాంగం గురించి ఎక్కడ మాట్లాడుకున్నా.. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రస్తావన వస్తుందని, రాజ్యాంగం, అంబేద్కర్ ల మధ్య విడదీయలేని సంబంధం ఉందని అన్నారు.
రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ను గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదని, రాజ్యాంగ ఉద్దేశం తెలుసుకోవడం కూడా కీలమేనని అన్నారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుపై మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తమ డబ్బును వినియోగించుకునే హక్కు ఉందని అన్నారు. కానీ, ప్రస్తుత ప్రపంచ మారుతోందని క్యాష్ లెస్ ఎకానమీ దిశగా పయనిస్తోందని చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుపై ప్రభుత్వ సంసిద్ధతను విమర్శిస్తున్నారని, వారి అసలు సమస్య తమను తాము సంసిద్ధం చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వకపోవడమని చెప్పారు.
దేశంలో సాధారణ వ్యక్తి అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా ఓ సైనికుడిలా పోరాడుతున్నాడని చెప్పారు. రాజ్యాంగంలో ఉన్న సగటు పౌరుడు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోయి ఏళ్లయిందని, కేవలం రాజ్యాంగంలోని హక్కులు మాత్రమే వారికి గుర్తు ఉన్నాయని అన్నారు. కొందరు తెలివైన వాళ్లు రాజ్యాంగంలో ఉన్న పౌరుడు నిర్వర్తించాల్సిన విధులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు.