
మత్స్యకారులకు రూ.కోటి
చిన్న, మధ్యతరహా మత్స్యకారులు పెద్దవైన,ఆధునిక పడవలను కొనుక్కునేందుకు కోటి రూపాయల రుణం ...
►కొత్త రుణ పథకాన్ని ప్రకటించిన ప్రధాని
►సోమ్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
►మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
డామన్ డయ్యూ: చిన్న, మధ్యతరహా మత్స్యకారులు పెద్దవైన, ఆధునిక పడవలను కొనుక్కునేందుకు కోటి రూపాయల రుణం ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బుధవారం డామన్ డయ్యూలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ఈ నిర్ణయం పేద మత్స్యకారులకు ఓ వరమన్నారు. ‘చిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లి వేటాడలేకపోతున్న పేద మత్స్యకారుల కోసం మేం కొత్త పథకాన్ని తెస్తున్నాం. ఈ పథకం ముసాయిదా దాదాపు పూర్తయింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలుచేస్తాం. పేద మత్స్యకారులు ఓ బృందంగా ఏర్పడాలి. ఈ బృందానికి ముద్ర పథకంలో భాగంగా రూ. కోటి రుణం ఇస్తాం.
ఇందులో 50 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది’ అని చెప్పారు. పెద్ద బోట్ల ద్వారా ఈ గ్రూపు సభ్యులు కలిసి సముద్రంలోకి వెళ్లి 12 నాటికల్ మైళ్లు (22.2 కి.మీ. ప్రాదేశిక జలాలు) దాటి వెళ్లి మరింత మత్స్య సంపద లాభాలను పంచుకోవచ్చన్నారు. దీనిపై డామన్ డయ్యూ ప్రజలు మరిన్ని సలహాలు సూచనలు ఇక్కడి అధికారులకు అందజేయవచ్చన్నారు. 9 మెగావాట్ల విద్యుత్ వాడుతున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతం 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయటం గొప్పవిషయన్నారు.
సోమ్‌నాథ్ ఆలయంలో మోదీ
అంతకుముందు రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. గిర్ జిల్లాలోని సోమ్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీకి ఆలయ ట్రస్టు చైర్మన్ కేశుభాయ్ పటేల్, బోర్డు సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ట్రస్టీలు స్వాగతం పలికారు.
మహిళా సాధికారతతోనే సంపూర్ణత
మహిళా సాధికారత జరగనంతవరకు మానవత్వానికి సంపూర్ణత రాదని మోదీ చెప్పా రు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా మహిళలకు శుభాకాంక్షలు తెలి పారు. మహిళల అభివృద్ధి గురించి కాకుం డా.. మహిళల నేతృత్వంలో అభివృద్ధి గురిం చి ఆలోచించాలన్నారు.
బాలికలపై వివక్ష వద్దు
బాలికల పట్ల వివక్షచూపే ధోరణి మారాలని ప్రధాని తెలిపారు. బాలికలను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి సామాజిక, జాతీయ, మానవతావాద బాధ్యతన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్‌లో ఏర్పాటుచేసిన మహిళా సర్పంచుల జాతీయ సదస్సులో మోదీ పాల్గొన్నారు. అనంతరం సర్పంచులకు ‘స్వచ్ఛ శక్తి’ అవార్డులను అందజేశారు.