ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) 2016-17 సంవత్సరానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 262 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్ తో రూ. 12,669.21 కోట్లతో పోలిస్తే మొత్తం ఆదాయం రూ. 14,989.33గా నమోదుచేసింది.
బ్యాడ్ లోన్లు తగ్గడం, వడ్డీ సంబంధ ఆదాయంలో పురోగతి ఫలితంగా ఈ లాభాలనుసాధించినట్టు పీఎన్‌బీ ప్రకటించింది. నికరవడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 33 శాతం ఎగసి రూ. రూ. 3683 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 13.7 శాతం నుంచి 12.53 శాతానికి బలహీనపడ్డాయని కొత్తగా నియమితులైన బ్యాంక్ డైరెక్టర్ సునీల్ మెహతా తెలిపారు. తన బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచేందుకు తన ఆస్తులను విక్రయించాలని యోచిస్తున్నచెప్పారు. రుతుపవనాలపై ఐఎండీ మంచి అంచనాలతో గ్రామీణ ఆదాయం బావుంటుందని అంచనావేశారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాల వల్ల గ్రామీణ గృహ రంగంలో వృద్ధి ఉంటుందని మేము భావిస్తున్నామని మెహతా అన్నారు. రిటైల్, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాల నుంచి లభిస్తున్న మంచి గిరాకీని చూస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 10-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని చెప్పారు.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2016-17లో గత ఏడాది 3,690వేలకోట్ల నష్టంతో పోలిస్తేనికర లాభం 1187వేలకోట్లుగా ఉంది. రూ. 57,225కోట్ల ఆదాయం సాధించింది. గత ఏడాది ఇది రూ. 56,903 కోట్లుగా ఉంది. అలాగే నికర ఎన్‌పీఏలు సైతం 8.61 శాతం నుంచి 7.81 శాతానికి దిగి వచ్చాయి. ప్రొవిజన్లు రూ. 9878 కోట్ల నుంచి తగ్గి రూ. 5753 కోట్లకు పరిమితమయ్యాయి. ఇతర ఆదాయం 68 శాతం జంప్‌చేసి రూ. 3102 కోట్లకు చేరింది. ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్‌బీ షేరు 4.55 శాతం లాభంతో ముగిసింది.