
అడిగింది చెబుతా.. అంతా చెబుతా!
శాసన మండలిలో గురువారం‘వ్యవసాయ ఆధునీకరణ, రుణమాఫీ, పెట్టుబడి రాయితీ చెల్లింపు’ అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆసక్తికర పరిణామాలు...
మండలిలో సుదీర్ఘంగా సమాధానాలిచ్చిన పోచారం
• ‘వ్యవసాయం’ అంశంపై ప్రశ్నలడిగిన సభ్యుల ఓపికకు పరీక్ష
• చివర్లో పప్పుధాన్యాలపై ప్రశ్నించిన బీజేపీ సభ్యుడు
• ‘మీరు అడుగుతారు బాగానే ఉంది..
• ఆయన గంట సమాధానం చెబుతా’రన్న చైర్మన్ స్వామిగౌడ్
• కృష్ణా బోర్డు చంద్రబాబు మేనేజ్‌మెంట్ బోర్డుగా మారింది: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో గురువారం‘వ్యవసాయ ఆధునీకరణ, రుణమాఫీ, పెట్టుబడి రాయితీ చెల్లింపు’ అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆసక్తికర పరిణామాలు, సరదా వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సావధానంగా, సుదీర్ఘంగా ఇచ్చిన సమాధానాలు సభలో ఉన్న వారి ఓపికను పరీక్షించాయి. తొలుత తాము లేవనెత్తిన అంశాలపై కాకుండా అంతా బాగుందంటూ మంత్రి సుదీర్ఘ సమాధానం ఇవ్వడంతో.. ‘ఆకలవుతున్నా కడుపు నిండిపోయింద’ని పొంగులేటి సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైనందున, మంత్రి ఇచ్చిన సమాధానం సరిగ్గా లేనందున వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అన్నీ మాట్లాడి ఇప్పుడు వాకౌట్ అంటున్నారని, విపక్ష సభ్యులు చేస్తున్నది రాజకీయ ఆరోపణలేనని మంత్రి పోచారం పేర్కొన్నారు.
వాస్తవాలు చెబుతున్నా అల్లరి చేస్తున్నారని.. వారి బతుకులు బయటపడతాయనే భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము విపక్షంలో ఉన్నపుడు రైతు సమస్యలపై అప్పటి సీఎం కిరణ్ చాంబర్ వద్ద ధర్నా చేస్తే.. తమ తొడలపై కాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారని పోచారం గుర్తు చేశారు. ఈ సమయంలో బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ... రాష్ట్ర ప్రభుత్వం పప్పు ధాన్యాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్.. అప్పటికే ఆయా అంశాలపై సుదీర్ఘంగా జరుగుతున్న చర్చను ఉటంకిస్తూ ‘మీరు అడుగుతారు బాగానే ఉంది.
కానీ ఆయన (మంత్రి పోచారం) గంట సేపు సమాధానం చెబుతారు.’ అని వ్యాఖ్యానించారు. దీంతో సభ మొత్తం ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. మళ్లీ మంత్రిని ఉద్దేశిస్తూ.. ‘వారు అడిగినంతే చెప్పండి’ అని స్వామిగౌడ్ సూచించారు. అయినా మంత్రి పోచారం మాత్రం తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఏయే పప్పుధాన్యం పంటను ఎంత విస్తీర్ణంలో వేశారు, గతేడాది కంటే ఎంత ఎక్కువ, పప్పుధాన్యాలకు ప్రోత్సాహం, సబ్సిడీపై విత్తనాల సరఫరా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలన్నీ వివరిస్తూ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.
రైతులను ఆదుకోవడంలో విఫలం
రాష్ట్రానికి కృష్ణా నీళ్లు ఆశించిన విధంగా రావడం లేదని.. కృష్ణా నది మేనేజ్‌మెంట్ బోర్డు కాస్తా చంద్రబాబు మేనేజ్‌మెంట్ బోర్డుగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. నాగార్జునసాగర్ నుంచి తెలంగాణకు నీళ్లు విడుదల కావడం లేదని.. వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకునే విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
కేంద్రం మాట మార్చినా మేం నిలబడ్డాం
• రూ 30.82 కోట్లతో స్పైస్ పార్క్ ఏర్పాటు: పోచారం
• మంత్రి వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు వాకౌట్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో స్పైస్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చి మాట మార్చినా, తాము నిలబడి రూ.30.81 కోట్లతో స్పైస్ పార్కును నెలకొల్పుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. పసుపు సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, పసుపు పంట, దాని అనుబంధ ఉత్పత్తులపై పరిశోధనలు చేసి వాటి ఫలితాలను రైతులకు అందించే లక్ష్యంతో పార్కు ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు. మంత్రి వివరణతో సంతృప్తి చేందని కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు. బుధవారం శాసన మండలిలో వ్యవసాయం ఆధునికీకరణ, రుణమాఫీ, పెట్టుబడి రాయితీ చెల్లింపుపై ప్రారంభమైన లఘు చర్చ గురువారం కూడా కొనసాగింది. కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ అడిగిన ప్రశ్నలపై పోచారం సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఈ ఏడాది యాసంగి కోసం ఎరువులు, విత్తనాలను ఎప్పుడూలేని విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు యూనిట్‌గా పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి శాసనసభ, మండలిలో తీర్మానం చేసి పంపగా కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వడగండ్ల వాన, నీట మునిగిన పంట, కోత అనంతరం పొలంలో తడిసిన పంటకు రైతుకు వ్యక్తిగతంగా పరిహారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని చెప్పారు. కాగా, రైతులకు బ్యాంకు రుణాలు ఎంత ఇచ్చారనే ప్రశ్నకు మంత్రి పొంతన లేని సమాధానం చెప్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు సభ నుంచి వాకౌట్ చేశారు.