
నెల్లూరులో నకిలీ కరెన్సీ.. నాణేలపై పుకార్లు
ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున నకిలీ కరెన్సీ పట్టుబడింది. రూ.2 లక్షలు విలువచేసే 500, 2000 నోట్లను ముద్రిస్తున్న యువకులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
- మొన్న రూ.10 నాణేలపై రూమర్లు
- నేడు భారీగా పట్టుబడ్డ నకిలీ 500, 2000 నోట్లు
- ముగ్గురు విద్యార్థుల అరెస్ట్
ఆత్మకూరు రూరల్: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున నకిలీ కరెన్సీ పట్టుబడింది. రూ.2 లక్షలు విలువచేసే 500, 2000 నోట్లను ముద్రిస్తున్న యువకులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురూ విద్యార్థులే కావడం గమనార్హం. ఇదే జిల్లాలో మొన్నటికిమొన్న రూ.10 నాణేలు చెల్లడంలేదంటూ పుకార్లు చెలరేగడం, నేడు భారీ ఎత్తున నకిలీ కరెన్సీ బయటపడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ముగ్గురు విద్యార్థులను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 వేల నోట్లు 20, రూ. 500 నోట్లు 300 మొత్తం రూ.1.90 లక్షల విలువ గల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి వివరాలు వెల్లడించారు.
నెల్లూరుకు చెందిన కొండూరు కుమార్‌రాజ, తోట వినయ్, ఉరిమి నితిన్ స్నేహితులు. వినయ్ డిగ్రీ చదువుతుండగా.. కుమార్‌రాజ, నితిన్ పాలిటెక్నిక్ కోర్సు చదువుతున్నారు. వీరు ముగ్గురు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కొత్తూరు శివారు ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని కంప్యూటర్, కలర్ ప్రింటర్, స్కానర్ ఏర్పాటు చేసి రూ. 2 వేలు, రూ. 500 నోట్లను స్కాన్ చేసి నకిలీ నోట్లను ముద్రించి రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ షేక్ ఖాజావలి, రూరల్ ఎస్సై అబ్దుల్ రజాక్ వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రింటర్, స్కానర్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
(చదవండి: దుకాణాలు, హోటళ్లలో నాణేలకు నో)