రాష్ట్రపతి కుమార్తెకు ఆన్‌లైన్ వేధింపులు
శర్మిష్ట ఫేస్‌బుక్ పేజీకి అసభ్య సందేశాలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధికార ప్రతినిధి శర్మిష్టా ముఖర్జీ ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారు. ఆమె ఫేస్‌బుక్ పేజీకి పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ దగ్గర్లోని నౌహతికి చెందిన పార్థా మండల్ అనే ప్రబుద్ధుడు శుక్రవారం రాత్రి అసభ్య సందేశాలు పంపాడు. అయితే ఆ ఆకతాయి చేష్టలపై శర్మిష్ట తీవ్రంగా స్పందించారు. అత ని పేరుతోపాటు అతను పంపిన సందేశాలను ఫేస్‌బుక్ ద్వారా బహిర్గతపరిచి, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదుచేశారు. ‘‘ఇలాంటి వ్యక్తులను బయటపెట్టి బహిరంగంగా అవమానించాలనుకుంటున్నా.
అందుకే అతని ప్రొఫైల్ స్క్రీన్ షాట్స్, అతను పంపిన సందేశాలను పోస్టు చేసి అతన్ని ‘ట్యాగ్’ చేస్తున్నా. దయచేసి ఈ పోస్టును ‘షేర్’ చేయడంతోపాటు ఈ దుర్మార్గుడిని ‘ట్యాగ్’ చేయండి. విపరీతబుద్ధిగల వారి ఇలాంటి చేష్టలను తేలిగ్గా తీసుకోబోమనే సందేశానివ్వండి’’ అని శర్మిష్ట శనివారం తన ఫేస్‌బుక్ పేజీలో కోరారు. ‘‘నాకు ఏమాత్రం తెలియని వ్యక్తి శుక్రవారం రాత్రి నాకు అసభ్య సందేశాలు పంపాడు.
తొలుత అతణ్ని పట్టించుకోకూడనుకున్నా. కానీ నా మౌనం వల్ల అతను రెచ్చిపోయి ఇతరులనూ వేధిస్తాడని గ్రహించా. అందుకే ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదుచేశా’’ అని శర్మిష్ట తెలిపారు. అయితే పోలీసులకు ఇటువంటి వేలాది కేసులు ఎదురయ్యే అవకాశం ఉందన్న శర్మిష్ట...ఈ వ్యవహారంలో సాధారణ మహిళగానే పోరాడాలనుకుంటున్నానని, రాష్ట్రపతి కుమార్తెను అయినందుకు తన విషయంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులన్నింటినీ పోలీసులు సమ దృష్టితో చూడాలన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తునకు ఆదేశిస్తామని డీసీపీ(సైబర్ నేరాలు) ఆయశ్ రాయ్ తెలిపారు.