షిర్డీ: మహారాష్ట్రలోని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం షిర్డీలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ముంబైకి బయల్దేరిన అలియన్స్ ఎయిర్ విమానానికి జెండా ఊపి వాణిజ్య కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించారు. యాత్రికులు, పర్యాటకులకు సేవలందించడంతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడానికి, కొత్త ఉద్యోగాల సృష్టికి ఈ విమానాశ్రయం దోహదపడుతుందని కోవింద్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సల్ పాల్గొన్నారు. దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తొలి విమానాశ్రయం ఇదేనని ఫడ్నవీస్ అన్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి అయిన రూ.350 కోట్ల వ్యయంలో రూ. 50 కోట్లను షిర్డీ బాబా సంస్థాన్ ట్రస్టువిరాళంగా ఇచ్చింది. దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన షిర్డీకి రోజుకు 60 వేల మంది పర్యాటకులు వస్తుంటారు.
వీరిలో 10–12 శాతం పర్యాటకులకైనా విమాన సేవలందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముంబై నుంచి 238 కి.మీ. దూరమున్న షిర్డీకి రోడ్డు మార్గం గుండా 5 గంటలు పడుతుంది. విమానంలో అయితే కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయంలో 2,500 మీటర్ల రన్‌వేను ఏర్పాటు చేశారు. 300 మంది ప్రయాణికులు ఒకేసారి విమానాశ్రయంలోకి రావడానికి, పోవడానికి వీలుగా 2,750 చ.మీ. టర్మినల్ భవనాన్ని నిర్మించారు.
హైదరాబాద్ నుంచి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్–షిర్డీ మధ్య నేటి నుంచి విమాన సర్వీసులు మొదలు కానున్నాయి. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన అలియన్స్ ఎయిర్ ఈ సేవలను ప్రారంభిస్తోంది. టికెట్ ధర ఒక వైపునకు రూ.2,844గా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గురువారం మినహా రోజూ మధ్యాహ్నం 2.10గంటలకు హైదరాబాద్‌లో విమానం బయలుదేరి 4 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విమానం 4.30కి బయల్దేరి 6.15కు హైదరాబాద్‌లో అడుగుపెడుతుంది. త్వరలో ట్రూజెట్ కూడా హైదరాబాద్, విజయవాడ నగరాల నుంచి షిర్డీకి సర్వీసులు ప్రారంభించనుంది.