నాపై ఆంక్షలు లేవు
ప్రధాని క్రియాశీలంగా ఉండడం సమస్య కాదు: సుష్మ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తనపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆయన క్రియాశీలక వైఖరి తనకు ఏమాత్రం సమస్య కాదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టంచేశారు. తమ బృందంలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల కోసం పోటీ లేదని, అందరం కలసికట్టుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఆదివారమిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏడాది కాలంలో తమ ప్రభుత్వం విదేశాంగ విధానంలో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రధాని క్రియాశీలకంగా ఉండడం సమస్యగా భావిస్తున్నారా అని కొందరు విలేకరులు అడగ్గా.. సుష్మ పైవిధంగా సమాధానమిచ్చారు. బయటకు పెద్దగా కనిపించడం లేదని ప్రశ్నించగా.. ‘‘నా వైఖరికి తగ్గట్టుగానే ఉంటా. నా ప్రస్తుత ప్రొఫైల్.. లో ప్రొఫైల్‌కే సరిపోతుంది. నేను లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతీరోజూ మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు విదేశాంగ మంత్రిగా ఆ అవసరం పెద్దగా ఉండదు.
విదేశాంగ మంత్రి మాట్లాడితే అది వ్యక్తిగత అభిప్రాయమో, పార్టీ అభిప్రాయంగానో చూడరు. ఒక దేశ వైఖరిగా చూస్తారు’’ అని బదులిచ్చారు. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేసి, హింసాయుత కార్యక్రమాలకు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని సుష్మా స్వరాజ్ తేల్చిచెప్పారు. ముంబై దాడుల సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.